iDreamPost

చేతలే సమాధానాలుగా అలవాటు చేసుకున్న సీఎం జగన్

చేతలే సమాధానాలుగా అలవాటు చేసుకున్న సీఎం జగన్

ప్రతిపక్షంలో ఉన్నా అంతే.. ఇప్పుడు పాలకపక్ష నేతగానూ అంతే అన్నట్టుగా ఉంది జగన్ తీరు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై ఆయన వ్యవహారశైలి ఆసక్తికరం. అన్నింటికీ సమాధానాలు ఇవ్వడం, దాని చుట్టూ వివాదాలు రాజేయడం అనే పద్దతికి ఆయన దూరంగా ఉంటున్నారు. అడపాదడపా పార్టీ నేతలతో కౌంటర్ తప్ప అనేక అంశాలకు స్పందించేందుకు జగన్ సుముఖంగా లేరని ఇప్పటికే నిరూపితమయ్యింది. కేవలం తన చర్యలు, చేష్టలే సమాధానాలుగా ఉంటాయని ఆయన భావించడం విశేషంగానే చెప్పాలి.

రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. అందులోనూ ప్రభుత్వ పక్షం మీద దాడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ప్రత్యేక పరిస్థితుల రీత్యా విపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శలు చేస్తున్న తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. రాజకీయంగా ఒకరంగా ఒకరికి పొసగని పార్టీలు, భిన్న కూటముల్లో ఉన్న పార్టీల నేతలు కూడా ఒకే మాట వల్లిస్తూ ఉంటారు. జగన్ ని విమర్శించేందుకు ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. అవకాశం వచ్చిందనగానే అంతా కలిసి ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా జగన్ మాత్రం తన వ్యూహాన్ని మార్చడం లేదు. తన పంథాలో సాగుతూ ప్రజల విశ్వాసం చూరగొనే లక్ష్యంతో సాగుతున్నారు. ఆయన పదే పదే చెబుతున్నట్టుగా రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం అనే మాటకు కట్టుబడి సాగుతున్నట్టు కనిపిస్తోంది.

జగన్ కి అధికారం ఇస్తే ఏపీ అధోగతేనని పదే పదే విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆదర్శనీయ ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరు. అనేక రాష్ట్రాల్లో పలు పథకాలకు ఆయన దిక్సూచి అవుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు ఏపీకి వచ్చి అమలవుతున్న పథకాలను పరిశీలించే స్థాయికి చేర్చారు. పెద్దగా ప్రచారం, హంగామా మాటలు లేకుండానే మోడల్ స్టేట్ గా మార్చే యత్నంలో ఉన్నారు. తద్వార తనకు ప్రచారం కన్నా ప్రజల శ్రేయస్సు కీలకం, ఏపీ భవిష్యత్తు ముఖ్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి తీరు కనిపిస్తోంది. తాజాగా జగన్ సీఎం అయిన తర్వాత అప్పుల భారం పెరిగింది, అభివృద్ధి విస్మరించి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారనే ప్రచారం కూడా ఓ వర్గం ఉధృతంగా చేస్తోంది. కానీ కేంద్రం తాజా లెక్కల ప్రకారం కొత్త ప్రాజెక్టులకు ఎక్కువ పెట్టుబడులు సాధిస్తున్న రాష్ట్రంగా ఏపీని రెండో స్థానంలో నిలపడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు, వాస్తవానికి పొంతన లేదని ఆయన చాటుతున్నట్టు చెప్పవచ్చు.

అన్నింటికీ మించి మతాన్ని రాజకీయాల్లో చొప్పించి పబ్బంగడుపుకునే ప్రయత్నాలను ఏపీలో కూడా మొదలుపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ కూడా స్వయంగా జగన్ వ్యక్తిగత విశ్వాసాల మీద గురిపెట్టి ఆయన్ని బద్నాం చేసే యత్నాలకు ఒడిగట్టారు. అయినా అదరకుండా తన మతం మానవత్వం అని బహిరంగంగానే ప్రకటించిన జగన్ అన్ని మతాలకు తగిన ప్రాధాన్యతనిచ్చేందుకు వెనుకాడేది లేదని తేల్చేశారు. ఏమతాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చిన్నబుచ్చడం జరగదని తన తీరు ద్వారా జగన్ చాటుతున్నారు. గతంలో తిరుమల బ్రహ్మోత్సవాలు, తాజాగా గోపూజ సందర్భంగా జగన్ వ్యవహారశైలి దానికి నిదర్శనంగా ఉంది. క్రైస్తవ మత ముసుగు వేసి జగన్ మీద విమర్శలు చేసిన వారికి జగన్ తగిన పాఠం చెప్పినట్టయ్యింది. ఆధ్యాత్మిక వాతావరణంలో తాను పాల్గొంటున్న కార్యక్రమాలకు త్రికరణ శుద్ధితో హాజరవుతున్న జగన్ తీరుని ఇప్పటికే పలువురు హిందూమత పెద్దలు కూడా హర్షించారు. రాజకీయపరంగా వస్తున్న విమర్శలను ఖాతరు చేయకుండా తాను చేయాలనుకున్నది చిత్తశుద్ధితో చేయడం ద్వారా ప్రజలకు చేరువకాగలమనే తన ధోరణిని సీఎం కొనసాగిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. నిత్యం మీడియా, ప్రెస్ నోట్లు, ట్వీట్లతో జగన్ మీద దుమ్మెత్తిపోసే వారికి తగిన సమాధానం చెప్పే రీతిలో జగన్ వ్యవహారశైలి ఉండడం విశేషంగా అంతా భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి