iDreamPost

కేబినెట్‌ భేటీకి ముహూర్తం ఖరారు.. ఈ నెలలో బడ్జెట్‌ సమావేశాలు

కేబినెట్‌ భేటీకి ముహూర్తం ఖరారు.. ఈ నెలలో బడ్జెట్‌ సమావేశాలు

ప్రతి నెల రెండు, నాలుగో బుధవారాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కరోనా ప్రభావం వల్ల గత రెండు నెలలుగా సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలింపులతో తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాలన కూడా పరుగులు పెడుతోంది. ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం కావాలని నిర్ణయించింది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో గల మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ భేటీ జరగనుంది.

ఇతర అంశాలతోపాటు.. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహణపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. వాస్తవంగా మార్చి నెలలో బడ్జెట్‌ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి నెలాఖరు లోపు నిర్వహించాలన్న లక్ష్యంతో పని చేసిన ప్రభుత్వం.. మార్చి 29 నాటికి ఎన్నికలను పూర్తి చేసేలా షెడ్యూల్‌ ప్రకటించింది. ఆ మరుసటి రోజు అంటే.. 30న బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది.

అయితే కరోనా వైరస్‌ దెబ్బతో అంతా ఛిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో మూడు నెలలకు అవసరమైన బడ్జెట్‌ కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దానికి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ నెలతో ఆ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు లోపు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి