iDreamPost

రాష్ట్రంలో సరికొత్త క్షీర విప్లవం

రాష్ట్రంలో సరికొత్త క్షీర విప్లవం

రాష్ట్రంలో సరికొత్త క్షీర విప్లవం ప్రారంభం కాబోతోంది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సహకార రంగంలో ఉన్న పాల డైరీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో నిర్వహణ లోపాలు, గత పాలకుల నిర్వాకంతో మూత పడిన సహకార డైరీలను ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ కు అప్పగించి.. వాటిని పునరుద్ధరించాలన్న ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో పశు సంవర్థక పార్కుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు డైరీ పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయడం వంటి నిర్ణయాలు సహకార రంగంలోని పాడి పరిశ్రమకు ఊపిరి పోస్తాయని భావిస్తున్నారు.

నారావారి పాలనలో నీరసించిన పరిశ్రమ

రాష్ట్రంలో ఉన్న పాల ఉత్పత్తిదారుల సంఘాలను 1981లో సహకార చట్టం పరిధిలోకి తెచ్చారు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాడి పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది. క్షీర విప్లవం సృష్టించింది. చిత్తూర్, ప్రకాశం, విశాఖ, కరీంనగర్, కర్నూల్ తదితర జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘాలు సొంతంగా డైరీలు ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు, ఒంగోలు డైరీలు అభివృద్ధి బాటలో పయనించి లాభాలు ఆర్జించాయి. అయితే 1995లో పాల సంఘాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం మాక్స్ చట్టం పరిధిలోకి తేవడం డైరీల పతనానికి దారి తీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీ కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. గుజరాత్ లోని ఆనంద్ డైరీ తర్వాత దేశంలో రెండో పెద్ద డైరీగా ఉన్న చిత్తూర్ డైరీ నష్టాల బారిన పడి 2001లో మూతపడింది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పాక్షికంగా పునరుద్ధరించారు. అయితే 2015లో మళ్లీ చంద్రబాబు హయాంలోనే అది మూతపడింది. ఇలా మూతపడిన డైరీలన్నింటినీ అమూల్ సంస్థకు లీజుకు ఇచ్చి పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాల సంఘాల సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఒంగోలు డైరీకి మంచిరోజులు

రాష్ట్రంలో మరో ప్రముఖ డైరీగా వెలుగొంది మూత పడిన ఒంగోలు డైరీ(ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం) పునరుద్ధరణకు ప్రభుత్వం నడుము బిగించింది. ఒకప్పుడు మంచి లాభాల్లో నడిచిన ఈ డైరీ నిర్వహణ లోపాలు, యాజమాన్యం అక్రమాల కారణంగా నష్టాల్లో కూరుకుపోయి మూత పడింది. పాలు సరఫరా చేసిన రైతులకు, ఉద్యోగులకు పెద్ద మొత్తాల్లో బకాయి పడింది. దీనిపై దృష్టి సారించిన జగన్ సర్కార్ గత ఏడాది రూ. 35 కోట్ల సాయం అందించింది. అయినా ఇంకా బకాయిలు ఉండటంతో పునరుద్ధరణ సాధ్యం కాలేదు. ఈ అంశం మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చింది. ఒంగోలు డైరీ పునరుద్ధరణకు మరో రూ. 69 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ప్రస్తుతం చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో 400 గ్రామాల్లో కొనసాగుతున్న అమూల్ సంస్థ కార్యకలాపాలను 708 గ్రామాలకు విస్తరించడానికి అనుమతి ఇవ్వనున్నారు. పశుగణాభివృద్ధికి ఊతం ఇచ్చేలా శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస, చిత్తూరు జిల్లా కుదుం గ్రామాల్లో పశు సంవర్థక పార్కులు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి