iDreamPost

అసాధారణ పరిస్థితుల్లో ఏపీ 24/7 ఛానెల్‌ .. చైర్మన్ రాజీనామా

అసాధారణ పరిస్థితుల్లో ఏపీ 24/7 ఛానెల్‌ ..  చైర్మన్ రాజీనామా

ఏపీ 24/7 ఛానెల్‌ చైర్మన్‌ పి. మరళీకృష్ణం రాజు తన పదవికి రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, రాష్ట్రేతర తెలుగు ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకూ ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఛానెల్‌లో నెలకొన్న పరిస్థితులను ఆ లేఖలో వెల్లడించారు.

ఇప్పటికే మీడియా రంగం కష్టాల్లో ఉందని చెప్పిన కృష్ణం రాజు.. తమ ఛానెల్‌ అసాధారణ పరిస్థితుల్లోకి వెళ్లిందని తెలిపారు. కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, ఇతర బకాయలు పేరుకుపోవడంతోపాటు.. ఉన్నతస్థాయి ఉద్యోగుల మధ్య కొట్లాటలు పోలీస్‌ స్టేషన్‌కు చేరాయన్నారు. సంస్థను గాడిలో పెట్టేందుకు తాను చేసిన సూచనలను యాజమన్యాం పట్టింకోలేదన్నారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని పేర్కొన్నారు.  

మురళి కృష్ణం రాజు గతంలో మా టివి ని స్థాపించి.. విజయపధంలో నడిపించారు. ఆ ఛానెల్ ను తెలుగు అగ్ర నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు కొనుగోలు చేశారు.

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో అనేక సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగులను తొలగించడం, అనవసరమైన ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రధాన పత్రికలు లాభాల్లో ఉన్నాయా..? అంటే సమాధానం కోసం తడుముకోవాల్సిందే.

ఇక టీవీ ఛానెళ్ల పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా దెబ్బతో ఎలక్ట్రానిక్‌ మీడియా కుదేలవుతోంది. వాటితో పోటీ పడలేకపోతోంది. వాణిజ్య ప్రకటనలను డిజిటల్‌ మీడియా ఎగరేసుకుపోతోంది. ఈ క్రమంలో ఆర్థిక భారంతో ఇప్పటికే పలు ఛానెళ్లు మూతపడ్డాయి. మీడియాలో ఘనమైన చరిత్ర ఉన్న జెమినీ న్యూస్‌ ఛానెల్‌ మూతపడింది. ఇటీవల కాలంలో వచ్చిన ఎక్స్‌ప్రెస్, మోజో టీవీలు అలా వచ్చి ఇలా వెళ్లడం ఎలాక్ట్రానిక్‌ మీడియా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా ఆ సరసన ఏపీ 24/7 కూడా చేరే పరిస్థితులు నెలకొన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి