iDreamPost

ఇంకో రీమేక్ పనులు షురూ

ఇంకో రీమేక్ పనులు షురూ

మన దగ్గర కథల కరువు ఉందో లేక ఇక్కడి రచయితల రాసేవాటి మీద నమ్మకం లేకనో కారణం ఏదైనా మలయాళంలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసే ట్రెండ్ మాత్రం అంతకంతా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. చిరంజీవి నుంచి విశ్వక్ సేన్ దాకా ఈ జాడ్యం ఎవరినీ వదలడం లేదు. తాజాగా నాయట్టు అనే మరో కేరళ మూవీని ఇక్కడ పునఃనిర్మించే పనులు వేగమందుకున్నాయి. అల్లు అర్జున్ స్పెషల్ రికమండేషన్ తో గీత ఆర్ట్స్ సంస్థ దీని హక్కులను కొనేసింది. రెండు నెలల క్రితం ఇది నెట్ ఫ్లిక్స్ లో రిలీజైనప్పుడు మన ప్రేక్షకులు సబ్ టైటిల్స్ తో చూసి మరీ మెచ్చుకున్నారు. ఇప్పుడు నేరుగా తెలుగులో రాబోతోంది

విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో కీలక పాత్రకు ఇటీవలే వకీల్ సాబ్ తో టాలీవుడ్ లో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన అంజలిని ఎంచుకున్నట్టు సమాచారం. సత్యదేవ్ ను లీడ్ రోల్ కు సంప్రదించగా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని వినికిడి. ఒకవేళ తను కాదనుకుంటే ఇంకో మీడియం రేంజ్ హీరోని సెట్ చేసుకోవాలి. రావు రమేష్ మరో క్యారెక్టర్ కు ఫిక్స్ అయ్యారట. దర్శకుడు ఎవరన్నది మాత్రం తేలలేదు. ఈ నాయట్టు తమిళ వెర్షన్ ని గౌతమ్ మీనన్ తీస్తున్నారు. ఏ మాయ చేసావే టైపులో ఆయన్నే ఇక్కడ కూడా తీయమని అడగొచ్చు. అయితే బడ్జెట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇది తేలలేదు.

టెక్నాలజీ దెబ్బకు వరల్డ్ సినిమా అరచేతుల్లోకి వచ్చాక రీమేకులు వీలైనంత త్వరగా తీయడం చాలా అవసరం. అందుకే ఈ నాయట్టుకి కేవలం నెల లేదా నెలన్నర రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఒకవేళ గౌతమ్ నో అంటే అప్పుడు ఇతర ఆప్షన్స్ వైపు చూస్తారు. దాదాపు మక్కికి మక్కి తీసేదే కాబట్టి ఇప్పటి అప్ కమింగ్ డైరెక్టర్ ఎవరికి ఇచ్చినా సరిపోతుంది. ఎలాగూ స్టార్స్ ఉండరు కాబట్టి హ్యాండిల్ చేయడం ఈజీ. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదల చేసే ఛాన్స్ ఉన్న ఈ మూవీకి వేట అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఎప్పుడో చిరంజీవి ఫ్లాప్ మూవీకి వాడిన పేరు ఇది. చూద్దాం ఏం డిసైడ్ చేస్తారో

Also Read : స్మాల్ మూవీ బిగ్ కలెక్షన్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి