iDreamPost

పీకల్లోతు కష్టాల్లో ఆంధ్రభూమి దినపత్రిక

పీకల్లోతు కష్టాల్లో ఆంధ్రభూమి దినపత్రిక

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ గ్రూప్స్ కి చెందిన ఆంధ్రభూమి దినపత్రిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.ఆర్థిక ఇబ్బందులతో పత్రిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.ఏ క్షణంలోనైనా పత్రిక మూత పడవచ్చననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు నాలుగు నెలలుగా నిలిచిపోయాయి. మరోవైపు డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక పలుచోట్ల మూత పడుతుంది. కొచ్చి,కోల్ కతా,ముంబై ఎడిషన్లు నిలిపివేశారు.బెంగళూరు ఎడిషన్ కూడా మూత దిశగా సాగుతోంది. దాంతో లాభాలు ఆర్జించే డిసి నిలిచిపోతే,ఇక ఆంధ్రభూమి నిర్వహణ సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

డెక్కన్ క్రానికల్ గ్రూప్ అటు ఇంగ్లీష్,ఇటు తెలుగు ప్రింట్ మీడియాలో ప్రత్యేకత సంపాదించింది.కానీ ఐపియల్ లో డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజ్ ను కొనుగోలు చేయడం సహా, ఇతర వ్యాపార లావాదేవీలలో ఆ గ్రూపు నష్టాలు కోనితెచ్చుకుంది.ఈ నేపథ్యంలో డి సి గ్రూప్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై ఈ డి లో కేసు కూడా నమోదయ్యింది.చివరకు సంస్థ చేతులు మారాల్సిన స్థితికి చేరింది.అయితే ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక కొనసాగేందుకు డోకా ఉండదని అంతా భావించారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పత్రికకు మంచి ఆదరణే ఉంది. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్రిక నిర్వహణ తలకు మించిన భారమని యాజమాన్యం భావిస్తోంది.

నేడు మీడియా రంగం ఏదో ఒక రాజకీయ పార్టీ స్వరంగా మారిపోతే తప్ప మనుగడ కష్టం అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. ఈ పరిణామాలతో ఇంగ్లీష్ పత్రికలలో ది హిందూ,టైమ్స్ గ్రూప్ పత్రికలకు పోటీగా సాగిన డెక్కన్ క్రానికల్ కూడా ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితి లేదు.ఈ స్థితిలో ఇక తెలుగు పత్రిక నిర్వహణ సాధ్యం కాదని యాజమాన్యం అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.ఈ పరిణామాలతో అంతోఇంతో ధీమాగా కనిపించిన ఆంధ్రభూమి సిబ్బందికి చిక్కులు తప్పేలా లేవనే సంకేతాలు వస్తున్నాయి. మీడియా వర్తమాన కష్టాలకు ఇదో ఉదాహరణగా మారుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి