iDreamPost

దేశంలోనే టాప్​లో నిలిచిన ఏపీ.. నాబార్డ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు!

  • Author singhj Updated - 02:40 PM, Thu - 17 August 23
  • Author singhj Updated - 02:40 PM, Thu - 17 August 23
దేశంలోనే టాప్​లో నిలిచిన ఏపీ.. నాబార్డ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు!

ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దూసుకెళ్తోంది. దీనికి నాబార్డ్ విడుదల చేసిన తాజా రిపోర్టు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. చిరుధాన్యాల ఉత్పత్తిలో చూసుకుంటే.. మొత్తం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఏపీ. జగన్ సర్కారు సహకారంతో చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులు మరే రాష్ట్రంలోనూ రానంత అధిక దిగుబడిని సాధిస్తున్నారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 2022-23 రిపోర్టు ప్రకారం ఏపీ 2022లో చిరుధాన్యాల దిగుబడిలో భారత్​లోనే టాప్ ప్లేసును దక్కించుకుంది.

ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 1.52 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలను సాగు చేయగా.. అందులో 3.6 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఆ లెక్కన హెక్టార్​కు 2,363 కిలోల దిగుబడి వచ్చిందని చెప్పొచ్చు. ఏపీ తర్వాతి స్థానంలో ఉన్న గుజరాత్​లో 2,310 కిలోల దిగుబడి వచ్చింది. చిరుధాన్యాల్లో ప్రధానంగా జొన్నల దిగుబడిలో ఆంధ్రప్రదేశ్​ మొదటి స్థానంలో నిలిచింది. ఏపీలో హెక్టార్​కు 3,166 కిలోల జొన్నల దిగుబడి వచ్చింది. ఏపీ తర్వాతి పొజిషన్​లో మధ్యప్రదేశ్​ (1,941 కిలోలు) ఉంది. చిరుధాన్యాలను అధికంగా సాగు చేసే (విస్తీర్ణం) రాష్ట్రాల్లో రాజస్థాన్ (35.5 శాతం) ఫస్ట్ ప్లేసులో నిలవగా.. మహారాష్ట్ర (20 శాతం), కర్ణాటక (13 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

చిరుధాన్యాల సాగులో రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటకలు టాప్​లో ఉన్నా.. ఆయా రాష్ట్రాల్లో మిల్లెట్ల దిగుబడి విస్తీర్ణానికి తగ్గట్లుగా లేకపోవడం గమనార్హం. రాజస్థాన్​తో పోల్చుకుంటే తక్కువ విస్తీర్ణంలోనే చిరుధాన్యాలు సాగు చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్​లో దిగుబడి శాతం ఎక్కువగా ఉండటం విశేషం. ఏపీలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో అధికంగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అలాగే కోస్తాలోని గిరిజన ఏరియాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. రాష్ట్రంలో చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతుండటంతో వాటి సాగుపై రైతన్నలు ఆసక్తి చూపుతున్నారని అధికారులు అంటున్నారు. నాబార్డ్​ సంస్థ కూడా చిరుధాన్యాలకు సంబంధించిన 22 కంపెనీ (ఎఫ్​పీవో)లను ప్రమోట్ చేస్తుండటం విశేషం. నాబార్డ్ ప్రమోట్ చేస్తున్న ఎఫ్​పీవోల కింద దాదాపు 9,970 మంది అన్నదాతలు సభ్యులుగా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి