iDreamPost

యాంకర్ సమంతా సందడి – హౌసులో హడావిడి

యాంకర్ సమంతా సందడి – హౌసులో హడావిడి

ఈ సీజన్ లో మొదటిసారి నాగార్జున అందుబాటులో లేని లోటుని కనిపించకుండా చేయడం కోసం యాంకర్ గా బిగ్ బాస్ 4 హౌసులోకి ఎంటరైన అక్కినేని కోడలు సమంతా తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చింది. మూడు గంటల సుదీర్ఘమైన ఎపిసోడ్ ని ఎలాంటి బెరుకు లేకుండా నడిపించి ప్రేక్షకులను మెప్పించింది . దాంతో నిన్న ఎలా ఉండబోతోందని టెన్షన్ పడిన అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఎపిసోడ్ ప్రారంభంలో వైల్డ్ డాగ్ షూటింగ్ స్పాట్ కులుమనాలి నుంచే నాగ్ వీడియోలో పార్టిసిపెంట్స్ తో మాట్లాడారు. ఆ తర్వాత సామ్ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఒక్కో అల్ఫాబెట్ ని ఉచ్చరిస్తూ ఆ అక్షరంతో మొదలయ్యే సభ్యుల గురించి విశ్లేషించిన తీరు ఆకట్టుకుంది.అందులో పంచులు కూడా బాగా పేలాయి. ఇక్కడ కూడా మోనాల్ ఏడవటం అసలు కామెడీ.

స్వయంవరం కాన్సెప్ట్ తో ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారు కానీ ఇదేమంత కిక్ ఇవ్వలేకపోయింది. కొంత సాగతీతగా కూడా అనిపించింది. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన అఖిల్ అందరినీ సర్ప్రైజ్ చేశాడు. నిన్నే విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ కూడా అక్కడ ప్రదర్శించాడు. మీరే నెంబర్ వన్ అంటూ అవినాష్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ని ఉద్దేశించి చెప్పడం అఖిల్ ఎంజాయ్ చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా విచ్చేశాడు. హైపర్ ఆదిని తీసుకొచ్చి సభ్యులతో చేయించిన కామెడీ బాగానే పండింది. తనదైన శైలిలో ఎవరినీ వదలకుండా ఫుల్ గా సెటైర్లు వేశాడు. పాయల్ రాజ్ పూత్ వచ్చి ఐటెం సాంగ్ చేయడం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సాగింది. పండగ రోజు కాబట్టి పోటీ కార్యక్రమాలను తట్టుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేశారు

ఆరెక్స్ 100 కార్తికేయ మంచి బీట్ సాంగ్ కి డాన్స్ చేసుకుంటూ వచ్చి కాసేపు హంగామా చేశాడు. ఈ సందర్భంగా షో గురించి నాగార్జున గురించి పొగిడేసి తనకిచ్చిన పని కానిచ్చేశాడు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో అవినాష్, దివిలు మిగలగా ముందే లీకైనట్టుగా దివినే బయటికి వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ లాస్యపై బాంబు పేల్చింది. స్టేజి మీదే కార్తికేయను అతని సినిమాలో దివికి ఆఫర్ ఇవ్వమని సమంతా అడగటం బాగానే ఉంది కానీ అదేదో వాళ్ళ హీరోల ప్రాజెక్ట్స్ లోనే ఇప్పిస్తే ఇంకా బాగుండేది కదా. మొత్తానికి గానాబజానాలతో బిగ్ బాస్ 4 మారధాన్ ఎపిసోడ్ జోరుగా సాగింది. ఒకపక్క భీష్మ ప్రీమియర్, మరోపక్క ఇతర ఛానల్స్ లో సెలబ్రిటీలతో భారీ రియాలిటీ షోల పోటీని తట్టుకుని మరీ ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి