iDreamPost

బావ మృతి కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్‌

బావ మృతి కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్‌

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ హత్యకేసులో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నల్లమిల్లి భావ సత్తిరాజు రెడ్డి రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సత్తిరాజు రెడ్డి మృతిలో ఆయన భావమరిది, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆయన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేసిన పోలీసులు ఈ రోజు హఠాత్తుగా నల్లిమిల్లిని అరెస్ట్‌ చేసేందుకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీగా నల్లమిల్లి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లమిల్లిని అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు బిక్కవోలు స్టేషన్‌కు తరలించారు.

నల్లమిల్లి అక్కను అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన సత్తిరాజు రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. సత్తిరాజు రెడ్డి మరో మహిళను కూడా వివాహం చేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సత్తిరాజు రెడ్డి బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. తన భర్త సత్తిరాజు రెడ్డిని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి చంపించారని ఆయన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్తిరాజు రెడ్డి తనను వివాహం చేసుకున్నారని, తమకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని సుమారు 45 ఏళ్ల వయసున్న సదరు మహిళ చెబుతోంది. తన భర్త చనిపోవడంతో తాము దిక్కులేనివారమయ్యాయమని విలపిస్తోంది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

అయితే సదరు మహిళ ఆస్తి కోసం కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని నల్లమిల్లి అనుచరులు విమర్శిస్తున్నారు. సత్తిరాజు రెడ్డికి పిల్లలు కలగకుండా గతంలోనే ఆపరేషన్‌ జరిగిందని చెబుతున్నారు. మహిళ చెప్పేదంతా అవాస్తవమంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు ఏమిటో బిక్కవోలు పోలీసులే తేల్చాలి. సత్తిరాజు రెడ్డి మరణం సహజంగా జరిగిందా..? లేక హత్యా..? సదరు మహిళ ఆయనకు రెండో భార్యా..? కాదా..? ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంత..? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే బిక్కవోలు పోలీసులు నోరు విప్పాలి.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలా రెడ్డి అనపర్తి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేసిన మూలారెడ్డి 1983, 1985, 1994, 1999లలో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009 వరకు అనపర్తిలో ఆ పార్టీ అభ్యర్థిగా మూలా రెడ్డి నిలబడ్డారు.

Also Read : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సౌమ్యుడైతే.. అరెస్ట్‌లు ఎందుకు జరుగుతున్నాయో..!

మూలారెడ్డికి వయస్సు పైబడడంతో 2014లో ఆయన కుమారుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. పోటీ చేసిన తొలిసారే రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి పై 1373 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2019లో సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతిలో 55,207 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఇటీవల ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. దేవుని ముందు ప్రమాణాలు చేసి వార్తల్లో నిలిచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి