iDreamPost

వలస కార్మికులకు ఓపిక ప‌ట్ట లేకనే కాలిన‌డ‌కన ఇళ్ల‌కు బ‌య‌లుదేరారు -అమిత్ షా వ్యాఖ్య‌లు

వలస కార్మికులకు ఓపిక ప‌ట్ట లేకనే కాలిన‌డ‌కన ఇళ్ల‌కు బ‌య‌లుదేరారు  -అమిత్ షా వ్యాఖ్య‌లు

దేశంలో క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల వ‌ల‌స కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప‌ని ప్ర‌దేశాల్లో ఉపాధి లేక‌పోవ‌డంతో ఆహారం, షెల్ట‌ర్‌కు నోచుకోలేక‌పోవ‌డంతో త‌మ స్వ‌స్థ‌లాల‌కు కాలి న‌డ‌క‌న వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ‌ల‌స కార్మికులు ఓపిక ప‌ట్ట లేక‌నే కాలిన‌డ‌క‌న ఇళ్ల‌కు బ‌య‌లు దేరారన‌ని పేర్కొన్నారు. అమిత్ షా ఒక జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కార్మికులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బస్సులను, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొంత మంది కార్మికులు ఓపిక పట్టలేక కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు’’ అని పేర్కొన్నారు.

దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా కేంద్రం మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడం కోసం ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి కేంద్రం బస్సులను అనుమతించింది. మే ఒకటవ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈలోగా కొంత మంది వలస కార్మికులు దొరికిన ప్రైవేటు వాహనం పట్టుకొని స్వస్థలాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దుర దృష్టవశాత్తును వారు వెళుతున్న వాహనాలు ప్రమాదాలకు గురవడం వల్ల దాదాపు 200 మంది వలస కార్మికులు మరణించారు.

కాలి నడకన బయల్దేరిన వారిలో కొందరు అలసిపోయి, ఎండవేడిని తట్టుకోలేక మరణించారు. మే 9 నుంచి మే 27 మధ్యన రైళ్లలో ఆకలికి తట్టుకోలేక, ఎండవేడికి జబ్బుపడి 80 మంది మరణించారని రైల్వే రక్షణ దళం లెక్కలే తెలియజేస్తున్నాయి. ‘‘ఐదారు రోజులపాటు జరిగిన కొన్ని సంఘటనలు బాధాకరం. ఆ తరువాత‌ వలస కార్మికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బస్సులను, రైళ్లను ఏర్పాటు చేసింది. అందుకోసం రాష్ట్రాలకు రూ.11 వేల కోట్ల రూపాయలను అందజేసింది. బస్సుల ద్వారా 45 లక్షల మందిని, రైళ్లు ద్వారా 55 లక్షల మందిని స్వస్థలాకు చేర్చాం’’ అని అమిత్‌ షా తెలిపారు. కొంత మంది మాత్రమే కాలినడకన ఇళ్లకు బయల్దేరారని షా తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది వలస కార్మికులు కాలి నడకన ఇళ్లకు బయల్దేరారని మీడియా లెక్కలు తెలియజేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి