iDreamPost

డబ్ల్యూహెచ్ఓ కు ఊహించని షాకిచ్చిన అగ్రరాజ్యం… శాశ్వతంగా కటీఫ్

డబ్ల్యూహెచ్ఓ కు ఊహించని షాకిచ్చిన  అగ్రరాజ్యం… శాశ్వతంగా  కటీఫ్

ప్రపంచ ఆరోగ్య సంస్ధకు ఊహించని షాకిచ్చింది అగ్రరాజ్యం అమెరికా. డబ్ల్యూహెచ్ఓతో అన్నీ రకాలుగా తమ సంబంధాలను తెంచుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. కరోనా వైరస్ సమస్య వచ్చిన దగ్గర నుండి ట్రంప్ ఇటు చైనా అటు డబ్ల్యూహెచ్ఓపై చాలాసార్లు మండిపడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సంస్ధకు ఇస్తున్న నిధులను కూడా తాత్కాలికంగా నిలిపేయటంపై ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచదేశాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

నిధులను ట్రంప్ ఆపేయటం ఈ సమయంలో మంచిది కాదని యావత్ ప్రపంచం ఆక్షేపించింది. దాంతో నిధుల విషయంలో ట్రంప్ పునరాలోచిస్తాడని అందరూ అనుకున్నారు. కరోనా వైరస్ విషయంలో మొత్తం ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందంటూ ట్రంప్ మండిపడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అదే సమయంలో చైనాకు సంస్ధ నూరుశాతం మద్దతుగా నిలబడిందంటూ ట్రంప్ విరుచుకుపడ్డాడు చాలాసార్లు.

యావత్ ప్రపంచానికి జవాబుదారీగా ఉండాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ కేవలం చైనాకు మాత్రమే మద్దతుగా నిలబడిందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వైరస్ కు చైనానే కారణమని అమెరికా ఎన్నిసార్లు ఆరోపించినా చైనాను సంస్ధ వెనకేసుకొచ్చిందంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్వహణకు ఏడాదికి అమెరికా 45 కోట్ల డాలర్లు ఇస్తుంటే చైనా కేవలం 4 కోట్ల డాలర్లు మాత్రమే ఇస్తున్న విషయాన్ని ట్రంప్ అనేక సందర్భాల్లో గుర్తు చేశాడు.

వైరస్ విషయంలో చైనాలో దర్యాప్తు చేయాలని తాము చేసిన డిమాండ్ ను చైనా పట్టించుకో లేదన్నారు. డబ్ల్యూహెచ్ఓ మద్దతు కారణంగా చైనా అమెరికాను, యావత్ ప్రపంచాన్ని లెక్క చేయటం లేదని ట్రంప్ భావన. ఈ కారణంగానే యావత్ ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేసిన ప్రపంచ ఆరోగ్యం సంస్ధతో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించటం సంచలనంగా మారింది. మరి దీనిపై మిగిలిన దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి