iDreamPost

కర్నూలు ఎంపీ చొరవతో ఢిల్లీ వెళ్లొచ్చిన వారందరూ క్వారంటైన్‌కు..

కర్నూలు ఎంపీ చొరవతో ఢిల్లీ వెళ్లొచ్చిన వారందరూ క్వారంటైన్‌కు..

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా ‘ఢిల్లీ’ లింకులపైనే చర్చ సాగుతోంది. నిజాముద్దీన్‌ సమీపంలో నిర్వహించిన ముస్లిం మత కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మందికి కరోనా సోకడంతో కలకలం రేగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు వెయ్యి మంది దాకా ఉన్నారు. వారిలోనూ కర్నూలు జిల్లా నుంచే అత్యధికంగా ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు పాతబస్తీకి చెందిన 188 మంది రాయలసీమ యూనివర్సిటీలోని క్వారంటైన్‌కు వెళ్లారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్, స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ చొరవతో ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు.

స్వతహాగా డాక్టర్‌ అయిన సంజీవ్‌కుమార్‌ దగ్గరుండి రాయలసీమ వర్సిటీలోని వార్డులన్నింటినీ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. వారందరికీ భరోసా కల్పించారు. అనంతరం ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారందరూ స్వచ్ఛందంగా ముందకు వచ్చారని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళనపడొద్దని సూచించారు. 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని మీడియాకు హితవు పలికారు.

మరోవైపు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాంతోపాటు, ఎమ్మెల్యేలు, అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వెళ్లి వచ్చిన వారు తిరిగిన ప్రాంతాలు, కలసిన వ్యక్తులు, బంధువులు, సన్నిహితులందరినీ ఆరా తీస్తున్నారు. ముందస్తుగా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఇప్పటికే కర్నూలు సర్వజనాసుపత్రి, విశ్వభారతి, శాంతిరామ్‌ బోధనాస్పత్రులను ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. వైద్యులు, నర్సుల కొరత లేకుండా ఉండేందుకు రిటైర్డ్‌ డాక్టర్లు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందిని రెడీగా ఉంచింది. తక్కువ సమయంలో కర్నూలు యంత్రాంగం తీసుకున్న చర్యలపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి