iDreamPost

దేశం… ఐక్య‌తా రాగం..!

దేశం… ఐక్య‌తా రాగం..!

రాజ‌కీయాల ప‌రంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అంశంలో దేశంలోని పార్టీల‌న్నీ ఒకేతాటిపై నిలిచాయి. దేశం మొత్తం మోదీతోనే ఉంద‌న్న సందేశాన్ని చైనాకు పంపాయి. సరిహద్దులో భారత, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర ‌మోదీ అఖిలపక్ష సమావేశాన్ని శుక్ర‌వారం నాడు నిర్వహించారు. దాదాపు 20 ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన నేత‌లు స‌మావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరె న్స్ లో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ… చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి చొరబడిన జూన్ ఆరో తేదీనే చైనాదేశంతో చర్చలు జరిపి స‌మ‌స్య తీవ్ర‌త‌ను త‌గ్గించి ఉంటే బాగుండేద‌ని అన్నారు. దేశ స‌రిహద్దు ల్లోకి నిఘావర్గాల ద్వారా సమాచారం అందలేదా అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. అమ‌ర వీరుల మ‌ర‌ణంపై విచారం వ్యక్తం చేశారు. వాస్తవాధీన రేఖ పరిణామాలపై కేంద్రం క‌చ్చిత‌మైన వివ‌రాలు అందించాల‌ని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది.

తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చైనా నియంతృత్వంపై మండిప‌డ్డారు. అమ‌ర‌వీరుల‌కు నివాళి అర్పించారు. మ‌న‌మంతా క‌లిసి ప‌నిచేస్తేనే.. దేశం గెలుస్తుంది. ఐక‌మ‌త్యంగా మాట్లాడి చైనాను ఓడిద్దాం.. ఈ విష‌యంలో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తాం.. అని చెప్పిన‌ట్లు తెలిసింది. క్లిష్ట సమయంలో దేశం మొత్తం మోదీతోనే ఉందన్న సందేశాన్ని చైనాకు పంపాల‌ని అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు.

జెడియు నేత నితీశ్ కుమార్.. మాట్లాడుతూ దేశ ప్రతిష్టకు చెందిన అంశంకాబట్టి అందరము కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. చైనాకు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. మేం ఎప్పుడు మీ వెంటే.. ఆర్మీ వెంటే అని శివసేన థాకరే అన్నట్లు తెలిసింది. ఎప్పుడూ భారత్ శాంతినే కోరుకుంటుంది అన్నారు. భారత్ తో పాక్, చైనా ప్రవర్తన బాగోలేదు. భారత్ చైనా డంపింగ్ యార్డ్ కాదు. చైనీస్ వస్తువులపై 300 శాతం సుంకం విధించండి.. అని సమాజ్ వాదీ నేత రాం గోపాల్ యాదవ్ సూచించారు.

ఆర్మీ సిద్ధం..

భారత్, చైనా సరిహద్దులో ఎలాంటి విపత్కర పరిస్థితులను అయిన ఎదుర్కొనేందుకు భారత సైన్యం ఎప్పుడూ సిద్దంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. అందరి సూచనలతో ముందుకు వెళ్తామని అఖిల పక్షానికి హామీ ఇచ్చారు. ఘర్షణాత్మక వాతావరణానికి ముందు, తర్వాత ఏం చర్యలు తీసుకున్నామో ఆయన అఖిలపక్ష నేతలకు వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి