iDreamPost

Bheemla Nayak : అందరి చూపు ఆ సినిమా వైపే

Bheemla Nayak : అందరి చూపు ఆ సినిమా వైపే

భీమ్లా నాయక్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి 25కి ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో యూనిట్ వేగం పెంచింది. ప్రత్యేకంగా హైప్ తేవాల్సిన పని లేదు కాబట్టి 21న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చేయబోతున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే వేదిక మీదే ట్రైలర్ లాంచ్ కూడా జరుగుతుందని అంటున్నారు కానీ రేపే వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇప్పుడీ సడన్ ఎంట్రీతో గని అయోమయంలో పడిన సంగతి తెలిసిందే. రేపో ఎల్లుండో ఓ నిర్ణయం తీసుకుని ప్రకటించబోతున్నారు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ఇదిలా ఉండగా బాక్సాఫీస్ దగ్గర సునామి రేంజ్ కలెక్షన్లు చూసి చాలా కాలమయ్యింది. అఖండ అదరగొట్టింది కానీ వంద కోట్ల రేంజ్ కు చేరుకోలేదు. బంగార్రాజు యాభైకే కష్టపడాల్సి వచ్చింది. పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలవడం ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని క్రాస్ చేసేలా భీమ్లా అరాచకం ఉంటుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. కేవలం థియేట్రికల్ బిజినెసే 90 కోట్లు దాటేసిందని ఇన్ సైడ్ టాక్. ఒక రీమేక్ సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ రావడం అరుదు. అది కూడా మలయాళంలో వచ్చిన రెండేళ్లకు తెలుగులో పునఃనిర్మించారు. దీనికి పవర్ స్టార్ మేనియా తప్ప మరో కారణం కాదని వేరే చెప్పాలా.

ఓటిటి హక్కులు డిస్నీ హాట్ స్టార్, శాటిలైట్ స్టార్ మాకు డీల్ చేసినట్టు సమాచారం. ఎంత అనేది క్లియర్ గా బయటికి రాలేదు కానీ రికార్డు మొత్తమే అంటున్నారు. నెల తర్వాతే స్ట్రీమింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ మీదే అందరి చూపు ఉంది. ఎవరి అంచనాలో వాళ్ళు ఏవేవో లెక్కలు వేసుకుంటున్నారు. హిందీ వెర్షన్ కూడా అదే రోజు రిలీజైతే పుష్ప ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాన్ని కనక క్రాస్ చేయగలిగితే రాబోయే పవన్ సినిమాలకు నార్త్ లోనూ థియేట్రికల్ మార్కెట్ పెరుగుతుంది. కాకపోతే ఎంత పవన్ సినిమా అయినా పాజిటివ్ టాక్ రావడం కీలకం. ఆ వైబ్రేషన్స్ అయితే ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాయి మరి

Also Read : A Thursday Report : ఏ తర్స్ డే రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి