iDreamPost

హిందీ వైకుంఠంకు రీమేక్ రిపేర్లు

హిందీ వైకుంఠంకు రీమేక్ రిపేర్లు

సంక్రాంతి పండక్కు వచ్చి ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో త్వరలో హిందీలోకి వెళ్లబోతోంది. మొదట రీమేక్ రైట్స్ అమ్మాలనుకున్నా తర్వాత ఇక్కడ నిర్మించిన బ్యానర్ల పైనే పార్ట్ నర్ షిప్ మీద బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తారట. అయితే డైరెక్షన్ త్రివిక్రమ్ చేయడు. కేవలం కథ స్క్రీన్ ప్లే వరకే ఆయన ప్రమేయం ఉంటుంది. ఫామ్ లో ఉన్న ఇంకో దర్శకుడిని రీమేక్ కోసం సెట్ చేస్తారు. అయితే కొన్ని కీలక మార్పులు స్క్రిప్ట్ లో జరుగుతాయట.

సుశాంత్ పాత్ర కథ పరంగా ప్రాధాన్యత ఇవ్వడానికి స్కోప్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోలా కథనం సాగడంతో అక్కినేని హీరోకు ఏమి ఒరగలేదు. దాని బదులు హిందీలో ఈ పాత్ర నిడివి పెంచి మల్టీ స్టారర్ లా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్ లోక్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లనే సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలిసింది. గీతా ఆర్ట్స్, హారికా హాసినితో పాటు మరో ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ దీని నిర్మాణంలో ఉంటాయి.

ఈ ఏడాదే మొదలుపెట్టి వచ్చే సంవత్సరం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఒక్క టబు తప్ప మిగిలిన క్యాస్టింగ్ మొత్తం మారిపోవచ్చు. టబుకి హిందీ వెర్షన్లో సీన్లు పెంచి పాత్ర నిడివి ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారట. మనకంటే త్రివిక్రమ్ కథలు కొత్త కాదు కానీ బాలీవుడ్ లో ఈ జానర్ సినిమాలు బాగా వర్కవుట్ అవుతాయి. హీరోగా ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మన రీమేకులను తెగ ఇష్టపడుతున్న షాహిద్ కపూర్ ఒక ఛాయస్ కాగా తాను ఇప్పటికే జెర్సీలో చేస్తున్నాడు. వైకుంఠపురములో సక్సెస్ కళ్లారా చూశాడు కాబట్టి నో అనే ఛాన్స్ ఉండకపోవచ్చు. మొత్తానికి హిందీ వైకుంఠం షూటింగ్ కు ముందే వార్తల్లో నిలుస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి