iDreamPost

అక్కినేని, దగ్గుబాటి – చెరొక కోటి

అక్కినేని, దగ్గుబాటి – చెరొక కోటి

టాలీవుడ్ నుంచి ఆపన్న హస్తాలు ముందుకు వస్తూనే ఉన్నాయి . ఊహించని ఉత్పాతం కరోనా రక్కసి రూపంలో దాడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో సామాన్య ప్రజలకు అండగా, ప్రభుత్వాలకు తోడుగా తమ వంతు సహకారాన్ని విరాళంగా అందిస్తున్నాయి. గత రెండు రోజులుగా వారు వీరు అనే తేడా లేకుండా అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లతో మొదలుకుని ఎందరో దర్శకులు, నిర్మాతలు ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్నారు.

తాజాగా అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు ఇందులో భాగమయ్యాయి. వేర్వేరుగా ఇచ్చిన ప్రకటనల్లో నాగార్జున సినిమా కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయలు ప్రకటించగా దగ్గుబాటి కుటుంబం ఉంచి కోటి రూపాయలు డొనేషన్ కింద అందాయి. ఇప్పటికే భారీ మొత్తాలు సమీకరణ అవుతున్న నేపధ్యంలో ఇంకొందరు ముందుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన వాళ్ళ సంగతి చూస్తే ప్రతిష్టాత్మక వైజయంతి సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షలు ప్రకటించింది. మైత్రి బ్యానర్ ఇదే తరహాలో 10 లక్షలు ఇవ్వగా దర్శకుడు సుకుమార్ వ్యక్తిగతంగా 10 లక్షలు ప్రకటించారు.

మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అందుతున్న మొత్తాలను చూస్తుంటే రోజు వారి వేతనాల మీద ఆధారపడే లక్షలాది కార్మికులకు, ఆర్టిస్టులకు లాక్ డౌన్ ఉన్న రోజులు కనీస అవసరాలకు లోటు లేకుండా గడిచిపోయేలా ఉన్నాయి. ప్రాధమికంగా అందుతున్న అంచనాల ప్రకారం ఇప్పటికే 15 కోట్లు దాటేసిన టాలీవుడ్ ఉదారత రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వల్ల షూటింగులు ఆగిపోయి ఇళ్ళల్లో రెస్టు తీసుకుంటున్న మన హీరోలు దర్శకులు సైలెంట్ గా ఉండకుండా వీలైనంత మేరకు ప్రజల్లో చైతన్యం వచ్చేలా వీడియోలు మెసేజులు పోస్ట్ చేస్తుండటం మంచి పరిణామం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి