iDreamPost

క‌మ‌లం గూట్లో పీకే క‌ల‌క‌లం..!

క‌మ‌లం గూట్లో పీకే క‌ల‌క‌లం..!

జ‌న‌సేనాని వ్య‌వ‌హారం కొత్త జ‌గ‌డాల‌కు కార‌ణంగా మారుతోంది. ఇప్ప‌టికే క‌ల‌హాల కాపురంలా మారిన ఏపీ క‌మ‌ల‌ద‌ళంలో కొత్త కాక రాజుకుంటోంది. బీజేపీ నేత‌ల మ‌ధ్య విబేధాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక కూడా కార‌ణంగా మారుతున్న వేళ కొత్త చ‌ర్చ మొద‌ల‌య్యింది. పీకే కార‌ణంగా కాషాయ ద‌ళం రెండు శిబిరాలుగా మారినట్టు క‌నిపిస్తోంది. ఈ ఆధిప‌త్య పోరు కార‌ణంగానే చివ‌ర‌కు జ‌న‌సేన‌తో క‌లిసి చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌కు కూడా బ్రేకులు పడుతున్న‌ట్టు చెబుతున్నారు.

ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని ఆశించిన బీజేపీ అనేక పార్టీల‌ను విలీనం కోసం ఆహ్వానించింది. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లుమార్లు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. త‌న‌ను స్వ‌యంగా అమిత్ షా విలీనం కోసం ఆహ్వానించార‌ని తెలిపారు. తాను పార్టీని విలీనం చేసేది లేద‌ని ప్ర‌క‌టించారు. కానీ అనూహ్యంగా బీజేపీ, జ‌న‌సేన కూడా చెరో మెట్టు దిగారు. చేతులు క‌లిపారు. పొత్తు పెట్టుకుని ఏపీలో ఉమ్మ‌డిగా క‌లిసి పనిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. అందుకు త‌గ్గ‌ట్టుగా స‌మ‌న్వ‌య క‌మిటీలు కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

తీరా చూస్తే బీజేపీ నేత‌ల్లో కొంద‌రికి ఈ ప‌రిణామాలు మింగుడుప‌డ‌డం లేదు. ఇప్ప‌టికే టీడీపీ ద‌త్త‌పుత్రుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప‌లువురు అభివ‌ర్ణిస్తున్న నేప‌థ్యంలో క‌మ‌లం నేత‌ల్లో కొంద‌రికి కూడా సందేహాలున్నాయి. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార‌ణంగా బీజేపీకి ఏమి క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది అర్థం కావ‌డం లేద‌ని చెబుతున్నారు. బ‌హుశా చంద్ర‌బాబు త‌న పార్టీకే చెందిన ఎంపీలు కొంద‌రిని బీజేపీలో పంపించిన‌ట్టుగా ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని కూడా పొత్తు కోసం సిద్ధం చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. త‌ద్వారా త్వ‌ర‌లో చంద్ర‌బాబు కూడా కూట‌మిలో చేరేందుకు కీల‌క అడుగులు ప‌డుతున్న‌ట్టు సందేహిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాబు ప్ర‌యోజ‌నాల కోసం ప‌వ‌న్ ప‌నిచేస్తే బీజేపీకి ఏమి లాభం ఉంటుంద‌నేది వారి ప్ర‌శ్న‌.

ఇప్పటికే ఏపీ బీజేపీలో స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. అన్ని అంశాల్లో త‌లోదారి అన్న‌ట్టుగా సాగుతున్నారు. బీజేపీ నేత‌ల మ‌ధ్య అభిప్రాయ బేధాలు అనేక విష‌యాల్లో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇలాంటి త‌రుణంలో ప‌వ‌న్ తో క‌లిసి ప‌నిచేసే విష‌యంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు చంద్ర‌బాబుతో క‌లిసి సాగిన బీజేపీలో ఏపీలో బ‌ల‌ప‌డ‌క‌పోగా మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే ప్ర‌మాదం దాపురించింద‌ని అనుభ‌వాల‌ను కొంద‌రు చెబుతున్నారు. అలాంటి త‌రుణంలో మ‌రోసారి అలాంటి త‌ప్పులు పున‌రావృతం చేస్తే ఇక పార్టీ కోలుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. దానికి ప్రారంభ‌సూచిక‌గానే జ‌న‌సేన రాక అని భావిస్తూ ప‌వ‌న్ తో క‌లిసి పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే విష‌యంలో పున‌రాలోచ‌న చేయాల‌ని సూచిస్తున్నారు. అలాంటి కొంద‌రు నేత‌ల త‌మ అభిప్రాయాల‌ను ఇప్ప‌టికే అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో తెలిపిన‌ట్టు చెబుతున్నారు. ఇలాంటి కొంద‌రు వ్య‌క్తం చేసిన అభిప్రాయ‌ల కార‌ణంగానే అమ‌రావ‌తి కోసం లాంగ్ మార్చ్ విష‌యంలో కేంద్రం బీజేపీ పెద్ద‌లు క‌న్నెర్ర చేసిన‌ట్టు స‌మాచారం. చివ‌ర‌కు దానిని వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింద‌ని బీజేపీ వ‌ర్గాల్లో ప్రచారం సాగుతోంది.

బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య చేతులు క‌లిసిన‌ప్ప‌టికీ మ‌న‌సులు క‌లిసే అవ‌కాశాలు స్వ‌ల్పంగా ఉన్న‌ట్టుగా ఈ ప‌రిణామాలు చెబుతున్నాయి. ప‌వ‌న్ ఎంత‌గా తాప‌త్ర‌య ప‌డుతున్నా బీజేపీ లోని ఓ వ‌ర్గం మాత్రం ఆయ‌న్ని , ఆయ‌న పార్టీని పూర్తిగా విశ్వ‌సించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దాంతో ఆ శిబిరానికి ఈ ప‌రిణామాలు ఏమేర‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌న్న‌ది త్వ‌ర‌లో తేల‌తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి