iDreamPost

చైతన్య దర్శకుడు ఇక లేరు

చైతన్య దర్శకుడు ఇక లేరు

ప్రముఖ తమిళ దర్శకులు నటులు ప్రతాప్ పోతన్ కన్నుమూశారు. చెన్నైలోని ఆయన స్వగృహంలో అచేతనావస్థితిలో కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఈయన వయసు 70. ఇప్పటికీ పలు సినిమాల్లో వెబ్ సిరీస్ లో నటిస్తూనే ఉన్నారు. కొన్ని షూటింగ్ స్టేజిలో ఉన్నాయి. 1991లో నాగార్జున నటించిన ‘చైతన్య’ ద్వారా ప్రతాప్ పోతన్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అందులో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. చాలా అడ్వాన్స్ గా ఆలోచించి చైతన్యలో చూపించిన జిప్సీ రేసింగ్ కాన్సెప్ట్ అప్పటి ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. తర్వాత ఇది మెచ్చినవాళ్లు ఉన్నారు.

ప్రతాప్ పోతన్ మలయాళం మూవీ ఆరవంతో యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఇది 1978లో వచ్చింది. ఆ తర్వాత ఎన్నో హిట్లు ఈయన ఖాతాలో ఉన్నాయి. తమిళం కన్నడం తెలుగులో మరపురాని క్యారెక్టర్లు వేశారు. 1980లో వచ్చిన బాలు మహేంద్ర డెబ్యూ మూడు పని ప్రతాప్ కెరీర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇందులో వేశ్యలను చంపే సీరియల్ కిల్లర్ గా ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ని విపరీతంగా మెప్పించింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, మరో చరిత్ర లాంటి క్లాసిక్స్ లో భాగమయ్యారు. 1985లో రాధికను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్ళకు విడాకులు తీసుకుని విడిపోయారు.

100 చిత్రాలకు పైగా నటించిన ప్రతాప్ పోతన్ కు దర్శకుడిగా అతి పెద్ద బ్రేక్ నాలుగు సినిమాల తర్వాత 1989లో కమల్ హాసన్ ప్రభుల మల్టీ స్టారర్ వెట్రి విజ(విజేతలు)తో దక్కింది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బోర్న్ ఐడెంటిటీ ఆధారంగా రూపొందిన ఆ యాక్షన్ థ్రిల్లర్ ఆ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. చివరిగా డైరెక్ట్ చేసింది 1997లో వచ్చిన మలయాళం మూవీ ఓరు యాత్రమొజి. ఆ తర్వాత నటనకే అంకితమైపోయారు. విడుదల కావాల్సిన చిత్రాలు ఇంకా నాలుగైదు ఉన్నాయి. మూడు భాషల్లో తనదైన ముద్రవేసిన ప్రతాప్ పోతన్ యాక్టర్ కం డైరెక్టర్ గా రెండు విభాగాల్లోనూ రాణించిన అరుదైన ఘనతను సాధించి సెలవు తీసుకున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి