iDreamPost

మొన్న మున్సిపల్, నిన్న రెవెన్యూ, నేడు ఆస్పత్రులు

మొన్న మున్సిపల్, నిన్న రెవెన్యూ, నేడు ఆస్పత్రులు

ఏసీబీ మెరుపుదాడులు

రాష్ట్రంలో ప్రజలకు అవసరమయ్యే ఏ విభాగంలోనూ అధికారులు అవినీతికి పాల్పడకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలను పీక్కుతినే అవినీతి అధికారుల భరతం పడుతోంది. అవినీతి నిరోధక శాఖకు కొత్త బాస్‌ సీతారామాంజనేయులను నియమించినప్పటి నుంచి ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో యాక్టివ్‌ అయ్యారు. ఇప్పటికే మన్సిపల్‌ శాఖలో అవినీతిపై కొరడా ఝలిపించారు. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై వేటు వేశారు. ఆ తర్వాత 13 జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. విజయనగరం, గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అవినీతి ఉద్యోగులను అదుపులోకి తీసుకొని, లక్షలాది రూపాయాలు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది. ఉద్యోగులు, కార్మికులకు చెందిన ఈఎస్‌ఐలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏసీబీ దాడులు ప్రాధాన్యం సంతరించుంది. అవినీతి ప్రక్షాళను ఇటీవల ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 14400కు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రులపై ఫిర్యాదులు వస్తుండడంతోనే ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలోని పాతపత్నం ఏరియా ఆస్పత్రి, విజయనగరం జిల్లాలోని భోగాపురం, విశాఖ జిల్లాలోని అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలోని తుని, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం, నెల్లూరు జిల్లాలోని గూడూరు, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లాలోని నంద్యాల, అనంతపురం జిల్లాలోని గుత్తి, వైఎస్సార్‌ జిల్లాలోని రాజంపేట, కృష్ణా జిల్లాలోని గుడివాడ, గుంటూరు జిల్లాలోని తెనాలి, ప్రకాశం జిల్లాలోని కందుకూరులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏక కాలంలో వందలాది మంది ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రోగులకు సరిగా భోజనం పెట్టకపోవడం, వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు తీసుకోవడం, మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు, సమయానికి వైద్యులు ఆస్పత్రులకు రాకపోవడం, రికార్డుల నిర్వహణలో లోపాలను అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వ విభాగంలోనూ అవినీతి లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి