iDreamPost

Aadavaallu Meeku Johaarlu : పద్మవ్యూహంలో శర్వా సినిమా

Aadavaallu Meeku Johaarlu :  పద్మవ్యూహంలో శర్వా సినిమా

శర్వానంద్ కొత్త సినిమా ఆడవాళ్ళూ మీకు జోహార్లుకు పెద్ద సవాళ్ళే ఎదురవుతున్నాయి. ఉన్నట్టుండి భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కే ఫిక్స్ కావడంతో ఓపెనింగ్స్ విషయంలో శర్వా టీమ్ కు కొంత టెన్షన్ ఉన్న మాట వాస్తవం. పవర్ స్టార్ ఉన్నంత మాత్రాన ఇంకెవరూ రాకూడదని కాదు కానీ హైప్ కోణంలో చూస్తే థియేటర్లలో పవన్ సందడే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండో సినిమాకు థియేటర్లతో పాటు ఆడియన్స్ సపోర్ట్ ఎంత మేరకు ఉంటుందనే దాని మీద ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. నాలుగైదు స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉండే చిన్న సెంటర్లలో మొదటి రోజు భీమ్లా నాయక్ వేసేందుకే ఎగ్జిబిటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది సహజం.

అలాంటప్పుడు ఆడవాళ్ళూ మీకు జోహార్లు చాలా బాగుందనే టాక్ రావడం కీలకంగా మారుతుంది. ఇప్పటికైతే ప్రమోషనల్ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలానే ఉంది. ఇలాంటి సబ్జెక్టులను డీల్ చేయడంలో దర్శకుడు తిరుమల కిషోర్ పనితనం తెలిసిందే కాబట్టి పాజిటివ్ బజ్ అయితే ఉంది. రష్మిక మందన్న గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తెరనిండా కనిపిస్తున్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఆకర్షణలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నా పవర్ స్టార్ తాకిడిని తట్టుకుంటాయా లేదా అనేదే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏ మేరకు ప్రభావం ఉంటుందోనని చూస్తున్నారు

దానికి తోడు శర్వానంద్ మార్కెట్ గత కొనేళ్లుగా డౌన్ లో ఉంది. మహాసముద్రం డిజాస్టర్ కు ముందూ ఫ్లాపుల మీద ఫ్లాపులు ఉక్కిరిబిక్కరి చేశాయి. మాస్ జనం మొదటి రోజే రావడం కష్టం. ఇదంతా చాలక అజిత్ వలిమై, గంగూబాయ్ కటియావాడిలు చెరోపక్క పోటీగా నిలుచున్నాయి. వీటి మధ్య ఆడవాళ్ళూ నెగ్గుకురావడం అంత సులభం కాదు. భీమ్లా నాయక్ టాక్ ఒకవేళ డివైడ్ గా వస్తే అప్పుడు కొంత బెటర్ కానీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందాయంటే మాత్రం ఇబ్బదులు తప్పవు. గ్యారెంటీ హిట్ గా ఆడవాళ్లు మీదే బోలెడు నమ్మకం పెట్టుకున్న శర్వానంద్ బృందం ఇప్పుడీ సవాళ్ళను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి మరి

Also Read : Bheemla Nayak : అందరి చూపు ఆ సినిమా వైపే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి