iDreamPost

కొత్త జిల్లాల ఏర్పాటుకు మోకాలడ్డు.. జీవోలు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్​

కొత్త జిల్లాల ఏర్పాటుకు మోకాలడ్డు.. జీవోలు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్​

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అధికార వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిజానికి అధికారంలోకి రాక ముందే ఈ విషయం మీద వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లాల పునర్విభజన చేయడం వల్ల తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతానికి ఎక్కువ మంది అధికారులు ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వారు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా అనేక రకమైన సౌలభ్యాలు ఉంటాయని భావించి, రాష్ట్ర అభివృద్ధి కోసం వైయస్ జగన్ జిల్లాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలా అయినా ఆయన చేస్తున్న పనులకు అడ్డం పడాలన్న ఉద్దేశంతో ఈ జిల్లాల పునర్విభజన ఆపాలి అంటూ కోర్టుకెక్కారు కొంతమంది.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్‌ను దానికి సంబందించిన మొత్తం 26 జీవోలు చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ముసాయిదా నోటిఫికేషన్‌, తదనంతరం జారీ చేసిన జీవోలు ఆర్టికల్ 371-డికి విరుద్ధమని, వాటిని రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా అప్పాపురంకి చెందిన దొంతినేని విజయ్‌ కుమార్‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు పిల్ దాఖలు చేశారు. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని వారి పిల్ లో కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులను పిల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిల్ మీద విచారణ జరపనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో గతంలో నిర్ణయించిన జోన్లు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు చోటు చేసుకుంటాయని అలా మార్చే అధికారం రాష్ట్రానికి లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాక కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై చాలా భారం పడుతుందని ఇప్పటికే ప్రభుత్వం భారీగా అప్పుల్లో ఉంది కాబట్టి ఈ జీవోల మీద స్టే ఇవ్వాలని కోరారు. కేంద్రం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పిటిషన్ లో కోరుతున్నారు. సోమవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ విషయం మీద ఎలా స్పందించనున్నది అనేది వేచి చూడాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి