iDreamPost

అమెరికాలో నల్గొండ యువకుడి కాల్చివేత..

అమెరికాలో నల్గొండ యువకుడి కాల్చివేత..

జీవితంపై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి, ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకున్న ఓ నల్గొండ యువకుడు అమెరికాలో ఓ నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. నల్లగొండ పట్టణంలోని వివేకానందనగర్‌ కాలనీకి చెందిన నక్క సాయిచరణ్‌ అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ మేరీల్యాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌ సిటీలో నివసిస్తున్నాడు. తన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపి తన కారులో తిరిగి వస్తుండగా ఇంటర్‌స్టేట్‌–95 హైవేలోని కేటన్‌ అవెన్యూ వద్ద ఓ నల్ల జాతీయుడు అతని కారుపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సాయిచరణ్‌ తలకు బుల్లెట్‌ తగలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

అయితే వెంటనే సమాచారం అందుకున్న మేరీల్యాండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన సాయిచరణ్‌ ని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. తలలో బుల్లెట్ దిగడంతో చికిత్స చేస్తుండగానే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాయి చరణ్ అక్క కూడా అమెరికాలోనే ఉంటుంది. మేరీల్యాండ్‌ రాష్ట్రంలో సాయిచరణ్‌ అనే భారతీయుడు కాల్పుల్లో మృతి చెందినట్లు స్థానికంగా టీవీల్లో వార్త ప్రసారం కావడంతో అతని అక్క హారిక వెంటనే పోలీసులని సంప్రదించగా అది తన తమ్ముడే అని తెలిసిందే.

దీంతో అతని మరణ వార్తని ఇంట్లో వాళ్ళకి చెప్పలేక హైదరాబాద్‌లో ఉండే బాబాయ్‌ కి ఫోన్ చేసి చెప్పింది. అమర్‌నాథ్‌ తొలుత సాయిచరణ్‌పై కాల్పులు మాత్రమే జరిగాయని చెప్పి తర్వాత చికిత్సలో మరణించాడని చెప్పాడు. సాయి చరణ్ తల్లి తండ్రలు మీడియాతో మాట్లాడుతూ.. చరణ్ ఎప్పుడూ మా మంచి కోసమే ఆలోచిస్తాడు. అక్కలాగే అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాడు. ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకున్నాం. అంతలోనే ఇలా కాల్పుల్లో మరణించాడు అంటూ విలపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి