iDreamPost

Fact Check: బాలిక శరీరంపై ప్రత్యక్షమౌతున్న దేవుళ్ల పేర్లు.. నిజమెంత?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ చిన్నారికి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ఆమె ఒంటిపై దేవుడి పేర్లు ప్రత్యక్షమవుతున్నాయి అంటున్నారు. అయితే అసలు అందులో నిజమెంతో చూద్దాం.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ చిన్నారికి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ఆమె ఒంటిపై దేవుడి పేర్లు ప్రత్యక్షమవుతున్నాయి అంటున్నారు. అయితే అసలు అందులో నిజమెంతో చూద్దాం.

Fact Check: బాలిక శరీరంపై ప్రత్యక్షమౌతున్న దేవుళ్ల పేర్లు.. నిజమెంత?

దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఏదొక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చిన్న చిన్న విషయాలుకూడా పెద్ద పెద్ద మిరాకిల్స్ అయిపోతున్నాయి. ఇలా జరగడానికి ప్రధానం కారణం ఏంటంటే.. చాలా విషయాలపై ఎలాంటి అవగాహన లేకుండానే వాటిని అందరికీ షేర్ చేయడమే. ఇప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ వారికి ఏది కనిపించినా కూడా వెంటనే షేర్లు కొట్టేస్తున్నారు. అలా ఇప్పుడు ఒక విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే చిన్నారి శరీరంపై దేవుడి పేర్లు ప్రత్యక్షం అవుతున్నాయి అనే విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని చాలా మంది నిజం అని కూడా నమ్ముతున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్లు కూడా చేస్తున్నారు. అయితే ఆ విషయంలో ఎంతమేర నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలోని ఎనిమిదేళ్ల బాలిక శరీరంపై కొన్ని అక్షరాలు దర్శనమిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మధోగంజ్ డెవలప్ మెంట్ బ్లాక్‌లోని సహిజ్నా గ్రామానికి చెందిన దేవేంద్ర, మమత దంపతుల నలుగురు పిల్లల్లో సాక్షి రెండో సంతానం. ఆమె ఒంటిపై కొన్ని అక్షరాలు, పేర్లు దర్శనమిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. రామ్-రామ్, రాధే-రాధే, బాబా జై గురుదేవ్ వంటి పేర్లు కనిపించాయి. అంతేకాకుండా ఆ బాలిక ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా ఆ పాప కడుపు, కాళ్లపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నిన్న మొన్న మైదలైన విషయం కాదు. గత నెల రోజులుగా తమ కూతురికి ఇలా జరుగుతోంది అంటూ కుటుంబం చెబుతోంది.

ఆ చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఈ సమస్య చూసి వైద్యులు సైతం నివ్వెరపోయారంట. కొన్ని రోజుల నుండి పాప ఒంటిపై దేవుళ్ల పేర్లు ఆటోమేటిక్‌గా కనిపించడంతో అక్టోబర్ 12న తల్లిదండ్రులు గుర్తించారు. ఆమెను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చూపించగా.. అలర్జీ మందు ఇచ్చారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో హర్దోయ్ లోని నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు. రాధ, రామ్ అనే హిందీ పేర్లతో పదాలు కనిపించే సరికి డాక్టర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమెకు అలా దేవతా పదాలు వస్తుండటంతో.. గ్రామస్థుల సలహా మేరకు .. అక్టోబర్ 25న మల్వాన్‌లోని ఇతియా దేవి ఆలయంలో పూజలు చేశారు. కొంత సమయం పూజల అనంతరం బాలిక శరీరంపై ‘ఇతియా దేవికి జై’ అని రాసి ఉండటం గమనించారు తల్లిదండ్రులు. కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. వారు గురు దేవ్ భక్తులు, ఇంట్లో అందరూ పూజలు చేస్తారు. సాక్షి కూడా పూజలు, భజనలు చేస్తూ ఉంటుంది. పాపకు దేవుళ్ల పేర్లు కనిపించడంపై దైవ సంకల్పం అంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే ఆ చిన్నారికి ఎదురైన విచిత్ర పరిస్థితికి సంబంధించి వైద్యశాస్త్రంలో కొంత సమాచారం అయితే ఉంది. ఇలా ఒటింపై అక్షరాలు, పేర్లు, రాతలు కనిపించడాన్ని డెర్మాటోగ్రఫియా అంటారు. దీనికి స్కిన్ రైటింగ్ అనే పేరు కూడా ఉంది. అంటే అదొక రకమైన చర్మ వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వారికి ఒళ్లు దురద పెడుతుంది. దురద పెట్టిందని మెల్లగా గీకినా కూడా అక్కడ లావుగా, వాపు వచ్చినట్లు గీతలు తేలి కనిపిస్తాయి. గీకిన దగ్గర కాస్త ఎర్రగా కూడా మారుతుంది. దాదాపు అలా వచ్చిన గీతలు ఒక 30 నిమిషాల తర్వాత తగ్గిపోతాయి. ఇది పెద్ద సమస్య అని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. దీనిని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు.

ఈ చర్మ వ్యాధి ఉన్న వారికి ఏదైనా మరీ ఇబ్బందిగా ఉంటే స్కిన్ డాక్టర్ ని కలవాలని సూచిస్తున్నారు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే.. కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువసేపు ఉంటాయని చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత తగ్గేందుకు కొన్ని నెలల నుంచి సంవత్సరాలు కూడా పట్టే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సాక్షి విషయంలో వినిపిస్తున్న పేర్లు కూడా ఇలాంటి ఒక వ్యాధి లక్షణం వల్లే వచ్చి ఉండచ్చు. అయితే ఇది నిజంగానే డెర్మాటోగ్రఫియా అంటే వైద్యులు పరీక్షించిన తర్వాత కచ్చితంగా చెప్పగలము. కానీ, సాక్షికి ఎదురైన పరిస్థితుల్లో మాత్రం డెర్మాటోగ్రఫియా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి.. ఈ డెర్మాటోగ్రఫియా వ్యాధి లక్షణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి