iDreamPost

వాలంటీర్లకు వరం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

వాలంటీర్లకు వరం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్ల రక్షణకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులను గుర్తించడంలో వాలంటీర్ల దే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను వాలంటీర్లు కలిసే అవకాశం ఉన్నందున వారందరికీ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద బీమా కల్పించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ శాఖకు వాలంటీర్ల బీమా విషయమై మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా విధులలో ఉన్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పోలీసు సిబ్బంది..తదితరులకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద బీమా కల్పించిన విషయం తెలిసిందే.

అయితే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఉంది. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక్కరు చొప్పున రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వీరందరినీ నియమించింది. ఊహించని మహా విపత్తు ఐన కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణలో వాలంటీర్లు అత్యుత్తమ సేవలను అందిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే వాలంటీర్లు మూడుసార్లు ఇంటింటి సర్వే చేపట్టారు. ఆ సర్వే ఆధారంగానే ఏపీ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతోంది. వాలంటీర్లు ఇచ్చిన డేటా ఆధారంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సహాయాన్ని వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు చేరుస్తున్నారు. ఇలాంటి అమూల్యమైన సేవలు అందిస్తున్న వాలంటీర్లను కాపాడుకొనేందుకు జగన్ సర్కార్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. తమ శ్రేయస్సు పై ఆలోచన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పై వాలంటీర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి