iDreamPost

పదే పదే అదే తీరు.. ముచ్చటగా మూడో రోజు..

పదే పదే అదే తీరు.. ముచ్చటగా మూడో రోజు..

శాసన సభలో గందరగోళం సృష్టించే క్రమంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుసగా మూడో రోజు సస్పెండ్‌కు గురయ్యారు. ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వపై ఇటీవల జరిగిన ప్రచారంలో వాస్తవ, అవస్తవాలపై ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం వివరించింది. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన ప్రచారం అంతా అవాస్తవమని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

ప్రాజెక్టుపై ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగిందన్న విషయాన్ని గణాంక సహితంగా సీఎం వైఎస్‌ జగన్‌ వివరిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. స్పీకర్‌ వారిస్తున్నా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో స్పీకర్‌ 9 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒక రోజు సస్పెండ్‌ చేశారు. అచ్చెం నాయుడు, రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, రామకృష్ణ, అశోక్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావులు సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు. మొదటి రోజు నుంచి మూడో రోజు వరకూ పలువురు టీడీపీ సభ్యులు తమ ప్రవర్తనతో సస్పెండ్‌కు గురవడం గమనార్హం.

సస్పెండ్‌ అయిన టీడీపీ శాసన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించారు. మర్షల్స్‌ రావాల్సి వచ్చింది. ఈ క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. సస్పెండ్‌ అయిన టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు వచ్చిన మార్షల్స్‌తో తోపులాటకు దిగారు. తమను సభ నుంచి బయటకు తీసుకెళుతున్న మార్షల్స్‌ పట్ల టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారు. మార్సల్స్‌పై దాడి చేశారని వైసీపీ, మార్షల్స్‌ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని టీడీపీ సభ్యులు సభలో వాదించుకున్నారు.

ఈ విషయంపై స్పీకర్‌ తమ్మినేని సీతారం స్పదించారు. సభ తీసుకున్న నిర్ణయానికి మార్షల్స్‌ ఏమి చేస్తారని, టీడీపీ సభ్యులు మార్షల్స్‌ పట్ల దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్‌ కమిటీకి సిఫార్సు చేస్తున్నామని ప్రకటించారు. ఏమి జరిగిందన్న విషయంపై స్పీకర్‌ కార్యాలయం మార్షల్స్‌ నుంచి సమాచారం తీసుకుంది. కాగా సాయంత్రం ఆరు గంటలకు సభను స్పీకర్‌ రేపటికి వాయిదా వేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి