iDreamPost

OTTలో కొత్త సినిమాల వరద

OTTలో కొత్త సినిమాల వరద

లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లో కొంత సైలెంట్ గానే ఉన్న ఓటిటి రంగం మెల్లగా విశ్వరూపం చూపడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా రిలీజైన వాటినే టెలికాస్ట్ చేస్తూ సొమ్ములు చేసుకున్న సంస్థలు తాజాగా విడుదల కానీ వాటిని కూడా నేరుగా ప్రేక్షకుల ఇళ్లలోకి తెచ్చేలా భారీ ప్రణాళికలు వేస్తోంది. ఈ విషయంలో అందరికంటే ముందంజలో ఉంటూ అమెజాన్ ప్రైమ్ మే, జూన్ నెలల్లో కనువిందు చేయబోతోంది. నిన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల కొత్త మూవీ ‘గులాబో సితాబో’ జూన్ 12న ఆన్ లైన్ లో వదలబోతున్నట్టు వచ్చిన ప్రకటన పెద్ద చర్చకే దారి తీస్తోంది.

ఇప్పుడు మరికొన్ని ఇదే దారిలో ప్రయాణం చేయబోతున్నాయి. విద్యా బాలన్ టైటిల్ రోల్ పోషించిన ‘శకుంతలా దేవి’ ప్రైమ్ ద్వారా అతి త్వరలో బుల్లితెరలను పలకరించబోతోంది. ఇది ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ భాగస్వామిగా ఉండటం విశేషం. అను మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశ్వద్ధామ, భీష్మ విలన్ జిస్సు సేన్ గుప్తా భర్తగా నటిస్తున్నారు. అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక సౌత్ లోనూ ఈ హడావిడి ఉదృతం కాబోతోంది. తెలుగులో చిన్న సినిమా ‘అమృతరామం’ వచ్చాక ఇంకెవరు ఓటిటి ప్రకటనలు చేయలేదు. కానీ అంతర్గతంగా కొన్ని చర్చలు జరిగి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

తమిళ్ లో సూర్య నిర్మాతగా భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తీసిన ‘పొన్మగళ్ వందాల్’ మే 29 వచ్చే అవకాశం ఉంది. కీర్తి సురేష్ చాలా టిపికల్ రోల్ చేసినట్టుగా చేసినట్టుగా ప్రచారంలో ఉన్న ‘పెంగ్విన్’ జూన్ 19న రావొచ్చని సమాచారం. ఇవి కాకుండా కన్నడ నుంచి ‘లా’, ‘ఫ్రెంచ్ బిర్యానీ’ అనే కన్నడ సినిమాలు జూన్ రెండు మూడు వారాల్లో రాబోతున్నాయి. మలయాళం నుంచి ‘సూఫీయుమ్ సుజాతయుం’ కూడా అదే నెలలో డిజిటల్ రిలీజ్ అందుకునే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కటిగా అధికారిక ప్రకటన రూపంలో ప్రైమ్ త్వరలోనే అప్ డేట్స్ ఇవ్వనుంది. ఇప్పటికే గులాబో సితాబో, శకుంతలా దేవి ప్రకటనలు ఇచ్చేసింది. ఇవన్నీ ఓకే కానీ మరి తెలుగు సినిమాలు కూడా కొన్ని ఇదే దారిలో ఎప్పుడు నడుస్తాయోనని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి