iDreamPost

సోషల్ మీడియా సమాచారాన్ని ఎంతమంది నమ్ముతున్నారు ? ఆక్స్ ఫర్డ్ ప్రెస్ సర్వేలో ఏం తెలిసింది ?

సోషల్ మీడియా సమాచారాన్ని ఎంతమంది నమ్ముతున్నారు ? ఆక్స్ ఫర్డ్ ప్రెస్ సర్వేలో ఏం తెలిసింది ?

ఇదివరకూ ఏదైన ఒక విషయం గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే పుస్తకాలు, పత్రికలు లేదా.. ఇతర మార్గాలను అనుసరించేవారు. కానీ.. స్మార్ట్ ఫోన్ వచ్చాక.. సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఏ విషయం గురించిన సమాచారమైనా.. మన అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లోనే లభ్యమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో లభించే సమాచారాన్నే ఎక్కువశాతం మంది నమ్ముతున్నారట. ఈ విషయం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చేసిన ప్రెస్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా భారత్ లో ఖచ్చితమైన సమాచారం కోసం.. 54 శాతం మంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లనే ఆశ్రయిస్తున్నారట. మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల్లో ఇది 43 శాతం ఉండగా.. బ్రిటన్ లో కేవలం 16 శాతమే ఉండటం గమనార్హం.

భారత్, మెక్సికో, దక్షిణాఫ్రికా, అమెరికా, యూకేల్లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ నిర్వహించిన ఈ సర్వేలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో 87 శాతం మంది సోషల్ మీడియాలో లభించే సమాచారం నిజమేనని నమ్ముతున్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది ఖచ్చితమైన సమాచారం కోసం గూగుల్ సెర్చింజన్ పైనే ఆధారపడుతున్నారు. నిజనిర్థారణకు 52 శాతం మంది ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లను వాడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో.. పుస్తకాలు, పత్రికల ద్వారా వాస్తవాలను తెలుసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

ముఖ్యంగా 25 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న 44 శాతం యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియా సమాచారాన్నే నమ్ముతామని పేర్కొన్నారు. భారత్ లో 30 శాతం మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఏ విషయం గురించి చెప్పాలన్నా వాట్సాప్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వచ్చే అంశాలనే ఉదాహరణలుగా చూపించి చెప్తుండటం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి