iDreamPost

ఏపీలో రెండు విడతలుగా జీతాలు

ఏపీలో రెండు విడతలుగా జీతాలు

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలకి వచ్చే రోజువారీ ఆదాయం ఒక్కసారిగా ఆగిపోవడంతో రాష్ట్ర ఖాజనాలు నిండుకుంటున్నాయి. ఒక వైపు సంక్షేమ పథకాలు మరో వైపు అభివృద్ధి పనులు కు నిధులు భారీగా ఖర్చు అవుతుండగా ఇప్పుడు ఉద్యోగస్తుల జీతాలకి సరిపడా నిధులు లేని పరిస్థితి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకొంది . ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో అత్యధిక భాగం ఉద్యోగుల జీతభత్యాలకి పెన్షన్లకి పోతుంది . తరువాతి స్థానం సామాజిక పెన్షన్లు , సంక్షేమ పధకాలది . ఆ తరువాత ప్రాధాన్యతాక్రమాలని బట్టి అభివృద్ధి కార్యక్రమాల వంతు.

లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా ఆదాయం ఆగిపోయేసరికి పలు రాష్ట్రాలు నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పడ్డాయి . ఈ క్రమంలో నిన్న తెలంగాణా సీఎం కేసీఆర్ సాలరీ స్కేల్ ను బట్టి 10 నుంచి 75% వరకు జీతాల్లో కోత విధించారు. దీనితో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే మార్గంలో జీతాలలో కోత విధిస్తాయన్న ప్రచారం జరిగింది.

తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చించి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ వెల్లడించారు .

ఇది ఉద్యోగుల జీతాల్లో కోత కాదని మొత్తం జీతం రెండు దఫాలుగా చెల్లిస్తారని స్పష్టం చేశారు. మొదటి విడతలో సగం వేతనం చెలిస్తామని , నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారంట . అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షన్ లోనూ , ఫోర్త్ క్లాస్ , వర్క్ ఇంచార్జ్ ఉద్యోగస్తుల వేతనాల్లో ఇరవై ఐదు శాతం తగ్గించి నిధులు సర్దుబాటు అయ్యాక జమ చేస్తామని తెలిపారన్నారు .

ఈరోజు సీఎం తో భేటీ అయ్యాక మీడియాతో మాట్లాడుతూ “ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉందామనే ఉద్దేశ్యంతో రెండు విడతలుగా జీతం అందిస్తామని తెలిపిన సీఎం కి సహకరించాలని తాము నిర్ణయం తీసుకున్నామని” సూర్యనారాయణ పేర్కొన్నారు .

ఏదేమైనా గత నెల జీతంలో కొంత వార్షిక ఇన్కమ్ టాక్స్ రూపంలో కట్టిన రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఈ నెల పూర్తి జీతం రావకపోవటం కొంత ఇబ్బందికరమే.ఏప్రెల్ చివరికి కరోనా వైరస్ కట్టడి కాకపోతే దాదాపు అన్ని రాష్ట్రాల జీతాలు , రోజు వారీ ఖర్చులు చెల్లించలేని స్థితికి చేరుకుంటాయని ఆర్ధిక వేత్తల అంచనా .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి