iDreamPost

5జీ భారత్.. అతి త్వరలో…!

5జీ భారత్.. అతి త్వరలో…!

భారత్ లో 5జీ ట్రయిల్స్ కు రంగం సిద్ధమైంది. ఇటీవలే టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఐతే 5జీ ట్రయిల్స్ కు సంభందించి ఎప్పటినుంచో ఆసక్తిగా మారిన అంశం..హువావే..! ఒకరకంగా చైనా టెక్నాలజీ కంపెనీ అయిన హువావే వల్లే ఇన్ని రోజులు 5జీ ట్రయిల్స్ పై భారత్ ఏ నిర్ణయం తీసుకోలేదని చూపొచ్చు. తాజాగా అన్ని టెలికం టెక్నాలజీ కంపెనీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐతే చైనా కంపనీకి అనుమతులివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హువావేకి అనుమతి ఇవ్వడం వల్ల భారత్ కు లాభమా.. ? నష్టమా? అనే విషయాలతోపాటు 5జీతో ఒనగూరే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

భారత్, చైనా… మధ్యలో అమెరికా

వాస్తవానికి భారత్ లో 5జీని 2019 ప్రారంభంలోనే ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ దేశ రాజకీయ పరిస్థితులు, గ్లోబల్ వాణిజ్య పరిస్థితుల వల్ల 5జీ ట్రయిల్స్ ఆలస్యమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన వాణిజ్య యుద్ధం భారత్ కు ఈ విషయంలో ప్రాణసంకటంలా మారింది. హువావేని భారత్ లో ప్రవేశించకుండా చేయాలని అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందులో భాగంగా భారత్ కు నచ్చచెప్పాలని చూసింది..అయినా ఎక్కడ అనుమతిస్తుందో అనే అనుమానంతో వివిధ మార్గాల్లో భయపెట్టాలని చూసింది. దీంతో చాలా కాలంగా ఈ విషంయంలో తాత్సారం చేసిన భారత్ తాజాగా 5జీ ట్రైల్స్ కు హువావేకి సైతం అనుమతి ఇచ్చింది.

హువావే వల్ల ముప్పుందా..

హువావే కంపెనీతో దేశభద్రతకు ముప్పు ఏర్పడుతుందని అమెరికా తన మిత్రదేశాలతో పాటు సన్నిహితంగా ఉండే అన్నిదేశాలను హెచ్చరించింది. దీనికి కారణం ఆ కంపెనీకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సన్నిహిత సంబంధాలు ఉండటమే. భారత్ భవిష్య డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 5జీ టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చైనా కంపినీకి అనుమతివ్వడం వల్ల మన దేశ సమాచారాన్నంతా బీజింగ్ సులభంగా తెలుసుకోగలుగుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. డోక్లామ్ వంటి సంఘటనలు జరిగినప్పుడు 5జీ టెక్నాలజీని ఉపయోగించి భారీ ఎత్తున సైబర్ అటాక్ కి పాల్పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అదే గనుక జరిగితే దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాలు హువావే కంపెనీకి అనుమతులిచ్చాయి? ఏయే దేశాలు నిషేధించాయో ఒకసారి చూద్దాం…

నిషేధించిన దేశాలు

అమెరికా

ఆస్ట్రేలియా

జపాన్‌, 
న్యూజిలాండ్‌
తైవాన్‌

అనుమతించిన దేశాలు

ఫ్రాన్స్‌
హంగేరీ
దక్షిణ కొరియా
థాయ్‌లాండ్‌
స్విట్జర్లాండ్‌
రష్యా
మలేషియా

ఏ నిర్ణయం తీసుకోనివి

కెనడా
ఇటలీ
ది నార్తర్‌ ల్యాండ్స్‌
జర్మనీ
యూకే

లాభామేంటి ..?

హువావేని నిషేధిస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని చైనా కొంత కాలంగా చెప్తూ వస్తోంది. హువావేని అనుమతిస్తే భారత్ కు కొన్ని లాభాలు ఉన్న మాట వాస్తవం. అందుకే అమెరికా వద్దన్నా భారత్ ఆ కంపనీకి అనుమతులిస్తూ నిర్ణయం తీసుకుంది. లాభాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా కాస్ట్ గురించి చెప్పాలి. యూరోపియన్ కంపెనీలతో పోల్చితే 20 శాతం తక్కువ ఖర్చుతో హువావే 5జీ టెక్నాలజీని ఏర్పాటు చేస్తుంది. పైగా ఆయా కంపెనీల కంటే త్వరగా 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఈ అంశంలో అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, ఫ్రాన్సులకు లేని భద్రతా పరమైన అభ్యంతరాలు భారత్ కు ఎందుకనే వాదనా ఉంది.

ఎవరు ఎవరితో..

వోడాఫోన్-ఐడియా స్వీడన్ కి చెందిన ఎరిక్‌సన్‌, హువావేలతో, భారతి ఎయిర్ టెల్ నోకియా, హువావే, ఎరిక్‌సన్‌లతో, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ దక్షిణ కొరియా కు చెందిన శాంసంగ్ తో 5జీ ట్రయిల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.

5జీ-ఒనగూరే ప్రయోజనాలు..

స్పీడే కాదు కొలువులు పెరుగుతాయి….

4జీ తో పోల్చితే 5జీకి పదింతల స్పీడ్‌ ఉంటుంది. నిమిషంలో సినిమా డౌన్లోడ్ అవుతుంది. ఇక ఆన్లైన్ ఆటలను ఇష్టపడేవారైతే 5జీ వస్తే మొబైల్‌లో మునిగిపోవడం ఖాయం. 5జీ నెట్‌వర్క్‌తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బ్యాంకింగ్‌ రంగంలో 2035 నాటికి 3.5 ట్రిలియన్‌ డాలర్ల రెవెన్యూ వస్తోందని, దాదాపు 22 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తోందని ‘ఇన్ఫర్మేషన్‌ హ్యాండ్లింగ్‌ సర్వీసెస్‌ మార్కెట్‌ 5జీ ఎకనామిక్‌ ఇంపాక్ట్‌ స్టడీ’ పేర్కొంది.

హై క్వాలిటీ

5జీ నెట్‌వర్క్‌తో హై క్వాలిటీ వీడియోను..బ్రేక్‌ లేకుండా స్పష్టంగా చూడవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండే దక్షిణకొరియా ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌ను పరిశీలించి చూసింది. ప్రాథమిక దశలో 4జీ కన్నా మూడురేట్ల వేగంగా ఉన్నట్టు గుర్తించామని ఎరిక్‌సన్‌ మొబిలిటీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఏఆర్, వీఆర్‌లో వీక్షకులు మరింత సౌకర్యంగా ఉంటుందని వెల్లడించింది.

ఫోన్లకు కొత్తరూపు…

ఎలక్టాన్రిక్‌ గూడ్స్‌లో రోజుకో మార్పు వస్తుంటోంది. ఇక మొబైల్స్‌ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే కర్వ్, కాప్చర్‌ మోడల్స్‌ మార్కెట్లోకొస్తున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ నేపథ్యంలో మొబైల్స్‌ను కూడా అదే స్థాయిలో కొత్త లుక్, స్పెసిఫికేషన్స్ తో కంపెనీలు రూపొందిస్తున్నాయి. మరోవైపు 5జీ ఫోన్లలో ప్రత్యేకంగా రేడియో ఫీచర్‌ను చేరుస్తామని మొబైల్‌ కంపెనీలు పేర్కొనడం విశేషం.

సైబర్ ముప్పు...

5జీ నెట్‌వర్క్‌తో సెబర్‌ కేటుగాళ్ల ముప్పు పెరుగుతుంది. 5జీ స్పీడ్‌తో వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనం. కానీ, సైబర్‌ కేటుగాళ్లు నగదును ఈజీగా, క్షణాల్లోనే కొల్లగొట్టే అవకాశం ఉంది. అంతేకాదు కార్పొరేట్‌ కంపెనీ ల్లో పనిచేసే ఉద్యోగులు తమ డేటాను వేగంగా ఇతరులకు షేర్‌ చేసే ప్రమాదం ఉంది. దీంతో ఆయా చోట్ల వీక్షణనను నియంత్రించేలా డేటాను సవరించాలని సంస్థలకు ఫోర్స్‌ పాయింట్‌ సూచించింది. అలా చేస్తే సైబర్‌ నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

నవశకమే..

5జీ నెట్‌వర్క్‌తో బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ‘డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ’ వెల్లడించింది. ఆన్లైన్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏటీఎంల వద్ద జనాలు గుమ్మిగూడే అవకాశం ఉండదని పేర్కొంది.

9.5 మిలియన్ల మొబైల్స్‌

2019లో 5జీ నెట్‌వర్క్‌ వస్తోందన్న ఊహాగానాలతో 9.5 మిలియన్‌ స్మార్ట్‌ ఫోన్లను కంపెనీలు ఉత్పత్తి చేశాయి. అయితే 2020 మార్చి–ఏప్రిల్‌లో బిడ్‌లు దాఖలు చేయనుండటంతో… జూన్‌ కల్లా 5జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి రానుంది. ఆ సమయానికి 5జీ మొబైళ్ల కొనుగోలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం క్వాల్‌కామ్‌ ఉత్పత్తిని తగ్గిస్తూ వెళ్తోంది. 4 జీ ఫోన్లకు క్రేజ్‌ తగ్గుతున్నందున 5జీ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నామని షియోమీ ప్రకటించింది.

గ్రీన్‌ సిగ్నల్‌..

ప్రపంచవ్యాప్తంగా 5జీ బ్యాండ్‌ను ఆమోదిస్తున్నట్టు 2019 ఏడాది ప్రారంభంలో ‘ప్రపంచ టెలికాం సంస్థ’ పేర్కొంది. 5జీ సేవలు 24.25 నుంచి 27.5 జీహెచ్‌జెడ్‌ ఫ్రీక్వెన్సీలో నడుస్తాయని తెలిపింది. 5 జీ నెట్‌వర్క్‌ కోసం బిడ్లను 2020 మార్చి–ఏప్రిల్‌లో నిర్వహిస్తామని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో తెలిపారు. బిడ్లు రూ.1.47 లక్షల కోట్ల నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర సంకేతాలు ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి