iDreamPost

ఆయారాం.. గయారాంలదే రాజ్యం

ఆయారాం.. గయారాంలదే రాజ్యం

దేశ రాజకీయాల్లో ఆయారాం గయారాంలకు కొదవేలేదు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా.. ప్రజా ప్రతినిధులు ఆ చట్టంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా పార్టీలు మారుతున్నారు. 1985లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధి తన పదవిని కోల్పోయే విధంగా చట్టం తెచ్చారు. అయితే ఆ చట్టాన్ని ఖద్దర్‌ నేతలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని నిత్యం కనిపిస్తూనే ఉంది. అసాధారణమైన రీతిలో ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఓ సర్వే తేల్చింది.

2016–2020 మధ్య దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారిన సమాచారాన్ని బేరీజు వేసుకున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపింది. ఈ నాలుగేళ్లలో దేశంలో 433 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించినట్లు ఏడీఆర్‌ తెలిపింది. ఆయా ప్రజా ప్రతినిధులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించి ఈ అంచనాలను కట్టింది.

Also Read : తమిళనాడులో సిఎం అభ్యర్థిపై తెలుగు వ్యక్తి పోటీ !

పార్టీ మారిన తర్వాత 433 మందిలో 405 మంది తిరిగి పోటీ చేశారు. 405 మందిలో 182 మంది తమ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. 38 మంది కాంగ్రెస్‌లోకి, 25 మంది టీఆర్‌ఎస్‌లోకి, 23 మంది టీడీపీలోకి వెళ్లారు. బీజేపీలో చేరిన 182 మందిలో 170 మంది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ వారే కావడం గమనార్హం. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడారు. ఈ సంఖ్య 18గా ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురు ఎంపీలు గోడదూకారు. 2019 ఎన్నికలకు ముందు ఐదుగురు ఎంపీలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఏడుగురు రాజ్యసభ సభ్యులు 2016–19 మధ్య కాంగ్రెస్‌ను వీడారు.

పార్టీ ఫిరాయింపుల వల్ల పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ప్రజా తీర్పును అవహేళన చేసేలా ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించడం, లేదా రాజీనామా చేసి ప్రభుత్వలు పడిపోయేలా వ్యవహరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు తమ పార్టీలను వీడడం వల్ల మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడిపోయాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read : కాంగ్రెస్-డీఎంకే సీట్ల పంపిణీ పూర్తి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి