iDreamPost

భళారే రాజకీయ సిత్రం

భళారే రాజకీయ సిత్రం

రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. 21వ శాతాబ్ధ రాజకీయాలను గమనిస్తున్న వారు మాత్రమే వాటిలోని గమ్మత్తు, తమాషా అర్థం చేసుకోగలరు. అందులోని వచ్చే హాస్యం జంధ్యాల సినిమాల్లో కూడా ఉండదని చెప్పొచ్చు. 20వ శాతాబ్ధంలో ఈ తమాషా పెద్దగా కనిపించదు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు రాజకీయ నాయకుడు ప్రవర్తించే తీరు గమనిస్తే ఆశ్యరం కలగకమానదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్ల పెద్దల నుంచి పదేళ్ల పిల్లల వరకు చంద్రబాబు అంటే తెలియని వాళ్లు ఉండరు. చివరి సారిగా 70 ఏళ్ల వయస్సులో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పని చేయడం వల్ల బాబు గురించి ప్రజలకు మరింతగా తెలిసింది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు, తర్వాత చేసిన పరిపాలన తర్వాత ప్రభుత్వాలకు కొన్ని అంశాల్లో కొత్త మార్గాలను చూపింది.

అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో కొన్ని రోజులుగా చంద్రబాబు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల వాటి తీవ్రతను పెంచారు. ధర్నాలు, బంద్‌లే వద్దని అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోగానే ఆ మాటలు మరచిపోయారు. ఈ అంశం ఇక్కడ అప్రస్తుతం. కాజా టోల్‌ ప్లాజా వద్ద ప్రభుత్వ చిఫ్‌ విప్‌పై టీడీపీ కార్యర్తలు దాడి చేయడం, అనుమతి లేకుండా బస్సు యాత్రకు సిద్ధపడడం వంటి ఘటనల్లో చంద్రబాబును, ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. నిన్న విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా మీదుగా రాజమహేంద్రవరం వెళుతుండగా తమ పార్టీ నేతలను తనను కలవనీయకుండా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

పైవాళ్లు (పాలకులు/ఉన్నతాధికారులు) చెప్పారని ఇష్టానుసారం చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని చంద్రబాబు పోలీసులను హెచ్చరించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసులను ఎలా ఉపయోగించుకున్నది బాబు మరచిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీలు, ప్రత్యేక హోదా కోసం తన హాయంలో ఉద్యమాలు చేయతలపెట్టిన అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులను పోలీసుల సహాయంతో ఏ విధంగా అడ్డుకుని, నిరసనలు అణచివేసి ఇంకా ఏడాది కూడా కాలేదు.

మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పిఎస్‌) ఛలో విజయవాడ కార్యక్రమం తలపెడితే ఆ సంఘం నేతలను ఎక్కడికక్కడ తమ ఇళ్లలోనే పోలీసులతో నిర్భందింపజేశారు. బయటకు వచ్చిన వారి అరెస్ట్‌లు చేసి స్టేషన్లకు తరలించారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇలా ప్రభుత్వ సేవలు అందిస్తున్న చిరుద్యోగుల ప్రతి నిరసనను అడ్డుకున్నారు.

ఇక తమకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాపులు చేసిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన విషయం మరిచిపోయిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలపై మండిపడుతున్నారు. హక్కుల గురించి మాట్లాడుతూ హాస్యాన్ని పండిస్తున్నారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన ఏ నిరసన కార్యక్రమం కూడా సాగనీయకుండా ఆయన్ను తన ఇంట్లోనే నిర్భందించారు. వందలాది మంది పోలీసులను ముద్రగడ ఇంటి ముందు మోహరించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోను, తన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్రగడ తలపెట్టిన పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు పడనీయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణం, మండల కేంద్రంలో పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 లు నెలల తరబడి నిరంతరం కొనాసాగించి శాంతిభద్రతల పేరున నూతన ఒరవడిని సృష్టించారు.

తమ పార్టీ నేతలు వారి వారి ఇళ్లలో నిరసన చేస్తున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఆ అధికారం పోలీసులకు ఎవరిచ్చారని కూడా చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మళ్లీ మనం గతంలోకి వెళితే బాబు గారి పాలనలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోందని తెలుసుకోవచ్చు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లు కల్పించాలంటూ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సమయంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను, కుటుంబ సభ్యులను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

టీడీపీ ప్రభుత్వంలో ఉద్యమాలు, నిరసనలను అణచివేసేందుకు ఉపయోగించిన అస్త్రం శాంతిభద్రతల సమస్య. ఇదే మాట చెప్పి ఐదేళ్ల కాలంలో వేలాది మందిపై బైడోవర్‌ కేసులు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు బాబు ప్రభుత్వం వాడిన శాంతిభద్రతల సమస్య అనే అస్త్రాన్నే వైఎస్సార్‌సీపీ సర్కార్‌ కూడా ఉపయోగిస్తోంది. అందుకే బాబు హక్కులు, అణచివేతలు అంటూ మాట్లాడుతుంటే ఆయన తీరును గమనించిన వారు నవ్వుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి