iDreamPost

4 వారాలు.. 25 సినిమాలు.. బాక్సాఫీస్ కి ఒక్కరే విన్నర్!

  • Author ajaykrishna Updated - 04:27 PM, Wed - 30 August 23
  • Author ajaykrishna Updated - 04:27 PM, Wed - 30 August 23
4 వారాలు.. 25 సినిమాలు.. బాక్సాఫీస్ కి ఒక్కరే విన్నర్!

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు అప్పుడే రైస్ అవుతూ.. ఆ వెంటనే డల్ అయిపోతుంది. ఓ వారంలో హిట్ పడింది అనుకునే లోపల తదుపరి వారంలో హిట్స్ కరువై పోతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రతీ శుక్రవారం విడుదల అవుతున్న సినిమాల సంఖ్య పెరిగింది. సరిగ్గా గమనిస్తే.. కేవలం తెలుగులోనే వందల సంఖ్యలో సినిమా రిలీజ్ లు కౌంట్ అవుతున్నాయి. 2023.. ఆగష్టు నెలలో నాలుగు వారాలకు కలిపి దాదాపు 25 సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. కానీ.. వీటిలో బాక్సాఫీస్ విజేతలుగా నిలిచిన సినిమాలెన్ని అనంటే.. ఒకటే అనే సమాధానం ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తుంది.

ఆగష్టు మొదటి వారంలో ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమాకు హైప్ లేదు.. ప్రచారం లేదు. ధోని నిర్మించిన LGM మూవీతో పాటు మిస్టేక్, రాజుగారి కోడి పులావ్, దిల్ సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, హెబ్బులి, బ్లడ్ అండ్ చాక్లెట్, ప్రియమైన ప్రియా.. వీటిలో ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. పైగా రీ రిలీజ్ అయిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.. ఉన్నంతలో కాస్త సందడి చేసింది. ఆగష్టు రెండో వారంలో బిగ్ వార్ జరుగుతుందని అంచనా వేశారు. కానీ.. ముందుగా వచ్చిన సూపర్ స్టార్ రజినీ సినిమానే వార్ వన్ సైడ్ చేసేసింది. రజినీ నటించిన జైలర్ మూవీ.. డబ్బింగ్ సినిమాగా విడుదలయినా తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి.. దుమ్మురేపింది. కానీ.. దీనికి పోటీగా వచ్చిన భోళా శంకర్ ఫస్ట్ డే నుండి తీవ్రంగా నిరాశలు గురిచేసింది.

ఇక ఆగష్టు మూడో వారం.. పిజ్జా 3, భూతాల బంగ్లా, ప్రేమ్ కుమార్, జిలేబి, మదిలో మది లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ.. వీటిలో కూడా ఏ ఒక్కటి ప్రభావం చూపలేకపోయాయి. వెరసి.. మూడో వారం కూడా జైలర్ దే హవా కొనసాగింది. కట్ చేస్తే.. ఆగష్టు నాలుగో వారం.. మోస్తరు అంచనాల మధ్య కింగ్ ఆఫ్ కొత్త, గాండీవధారి అర్జున, బెదురులంక సినిమాలు వచ్చాయి. వీటిలో బెదురులంక కాస్త పర్వాలేదు అనిపించింది. కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్ కి చేరుకుంటోంది. ఓ విధంగా బెదురులంక సేఫ్ అయినట్లే. కానీ.. కింగ్ ఆఫ్ కొత్త, గాండీవధారి అర్జున సినిమాలు దారుణంగా బెడిసికొట్టాయి. మొత్తానికి ఆగష్టులో సుమారు 25 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ.. ఆగష్టు విన్నర్ గా సూపర్ స్టార్ జైలర్ హవా కొనసాగుతుంది. మరి ఆగష్టు నెలలో విడుదలైన సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి