iDreamPost

2 వేల కోట్ల విమానం.. ఒక్కసారి కూడా వాడకుండానే తుక్కు కింద అమ్మేసిన సౌదీ రాజులు..

2 వేల కోట్ల విమానం.. ఒక్కసారి కూడా వాడకుండానే తుక్కు కింద అమ్మేసిన సౌదీ రాజులు..

 

సౌదీ అరేబియా దేశంలో ఇంకా రాచరికపు పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ ఇక్కడ సర్వాధికారాలు రాజుకే ఉంటాయి. ప్రపంచంలో అత్యంత సంపన్నుల రాజకుటుంబాల్లో సౌదీ రాజు కుటుంబం కూడా ఒకటి. ఈక్రమంలో 2012కి ముందు ఉన్న సౌదీ రాజు ‘సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ తన అధికారిక పర్యటనల కోసం ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ‘బోయింగ్ 747-8’గా పిలిచే పెద్ద విమానాన్ని ఆర్డర్ ఇచ్చారు. ఆ రాజు అభిరుచికి తగ్గట్టు విమానసంస్థ దీన్ని తయారు చేసింది.

 

అప్పట్లోనే దీని విలువ దాదాపు $295 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.2,254 కోట్లుపైనే. రాజు కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ విమానంలో చాలా లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. విమానం ఆర్డర్ చేసి డెలివరీ అందుకునేలోపే రాజు ‘సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ 2012లో మృతి చెందారు. దీంతో ఆ రాజు కుటుంబీకులు కానీ, తర్వాత వచ్చిన రాజు కానీ ఈ విమానం గురించి పట్టించుకోలేదు. దీంతో ఈ ‘బోయింగ్ 747-8′ 2012 నుంచి స్విట్జర్లాండ్ లోని బాసెల్ నగరంలోనే ఉండిపోయింది. పదేళ్లుగా దీనిని వాడకుండా అక్కడే ఉంచారు.

 

ఇంత భారీ విమానం పదేళ్లుగా ఎవరు వాడకపోవడంతో తిరిగి తామే కొనుగోలు చేసి ఉపయోగించాలని బోయింగ్ సంస్థ భావించింది. దీంతో ఈ విషయం సౌదీ ప్రస్తుత రాజుకి తెలిపి ఈ విమానాన్ని తుక్కు (స్క్రాప్) కింద కొనుగోలు చేసింది బోయింగ్ సంస్థ. ఆ తర్వాత ఈ విమానాన్ని ఇటీవలే అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న పీనల్ ఎయిర్‌పార్క్ కి తరలించారు. ప్రపంచంలో పనికిరాని తుక్కు విమానాలను ఇక్కడికే తరలించి, పార్టులుగా విడగొట్టి అందులో పనికొచ్చేవాటిని తిరిగి వాడతారు. దీంతో ఈ విమానం కూడా చివరకి ఇక్కడికే చేరింది.

 

బోయింగ్ 747 సిరీస్ లో ఈ సంస్థ తయారు చేసిన చివరి విమానం కూడా ఇదే కావడం విశేషం. ‘Queen of the Skies’గా పిలిచే ఈ విమానాన్ని చాలామంది ధనవంతులు ఇష్టపడేవారు. సౌదీ రాజు కొన్న ఈ విమానం చెక్ చేయడం కోసం 42 గంటలు మాత్రమే గాలిలో ఉంది. ఇది కొన్న తర్వాత ఒక్కసారి కూడా వాడకుండానే 2000 కోట్ల విమానాన్ని తుక్కుగా అమ్మేయడంతో ఆశ్చర్యపోతున్నారు సామాన్య ప్రజలు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి