iDreamPost

అమెరికా అధ్యక్షుడి నిఘా వ్యవస్థలో పాక్ గూఢచారుల చొరబాటు!

అమెరికా అధ్యక్షుడి నిఘా వ్యవస్థలో పాక్ గూఢచారుల చొరబాటు!

ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడి భద్రత, నిఘా వ్యవస్థలోకి పాకిస్తాన్ గూఢచారులు చొరబడటం అమెరికా రక్షణ, భద్రతా విభాగాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీకి చెందినవారిగా భావిస్తున్న ఇద్దరు ఆగంతకులను గుర్తించి అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని కుట్రగా భావిస్తున్న అధికారులు తాహెర్ జాదా (40), హైదర్ అలీ(35)ల నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. గత కొంతకాలంగా అమెరికా, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఐఎస్ఐకి చెందిన ఇద్దరు ఏజెంట్లు అమెరికా భద్రత, నిఘా వ్యవస్థల్లోకి చొరబడటం, అధ్యక్షుడు బైడెన్ సతీమణి జిల్ బైడెన్ సెక్యూరిటీ కవర్ వరకు దాదాపుగా చేరుకోవడాన్ని అమెరికా భద్రతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

విలువైన కానుకలు ఎరగా వేసి..

తాహెర్ జాదా, హైడెర్ అలీలు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ (యూఎస్ఎస్ఎస్) కు చెందిన పలువురు అధికారులు, ఏజెంట్లతో పరిచయాలు పెంచుకుని దేశాధ్యక్షుడి భద్రత, ఇతర వివరాలు సేకరించేందుకు విలువైన బహుమానాలను ఎరగా వేశారు. ఒకరితర్వాత ఒకరిని మచ్చిక చేసుకుంటూ అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ రక్షణ శ్రేణి వరకు చొరబడగలిగినట్లు సమాచారం. యూఎస్ సీక్రెట్ సర్వీస్ కు చెందిన పలువురు అధికారులతోపాటు హోమ్ శాఖకు చెందిన ఓ అధికారికి రెంట్ ఫ్రీ అపార్టుమెంట్లు, ఐ ఫోన్లు, డ్రోన్లు, టీవీలు, జెనరేటర్లు, అసాల్ట్ రైఫిల్స్ ఎరగా వేసినట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు ఐడెంటిటీలతో వీరు తమను తాము అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఉద్యోగులుగా నమ్మించారు. భద్రత, నిఘా అధికారులు ఎక్కువగా నివసించే అపార్ట్మెంట్లలోనే నివాసం ఏర్పరచుకుని, పరిచయాలు పెంచుకోవడం ద్వారా అధ్యక్షుడి రహస్యాల సేకరణలో నిమగ్నం అయ్యారు.

కోర్ట్ పరిధిలో విచారణ

పాక్ ఏజెంట్ల చొరబాటును ఆలస్యంగా గుర్తించి అరెస్టు చేసిన భద్రతాధికారులు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. యూఎస్ పోస్టల్ సర్వీస్ లెటర్ క్యారియర్ ద్వారా పాక్ ఏజెంట్ల గుట్టు బయటపడింది. వెంటనే వారిద్దరినీ అరెస్టు చేసి కొలంబియా జిల్లా కోర్టుకు అప్పగించారు. వీరి నుంచి బహుమతులు తీసుకుని, సమాచారం లీక్ చేశారని భావిస్తున్న నలుగురు యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను సెలవుపై పంపేశారు. నిందితులు తాహెర్ జాదా, హైదర్ అలీల వద్ద పాకిస్తాన్, ఇరాన్ దేశాలకు చెందిన పలు వీసాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి సాయంతో హైదర్ అలీ పశ్చిమ ఆసియా, టర్కీ, ఖతార్ తదితర దేశాలు తిరిగినట్లు గుర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి