iDreamPost

1917 – అద్భుత‌మైన సినిమా

1917 – అద్భుత‌మైన సినిమా

యుద్ధ‌మంటే మృత్యువు. మ‌ర‌ణాన్ని నిర్వ‌చించ‌డం క‌ష్టం. అది ఏ రూపంలో వ‌స్తుందో తెలియ‌దు. కానీ యుద్ధంలో మాత్రం అది తూటా ద్వారా వ‌స్తుంది. బాంబుగా ద‌గ్ధం చేస్తుంది. ఫిరంగి గుండుగా ఢీకొంటుంది. యుద్ధ‌మంటే మ‌ర‌ణ దేవ‌త ప్రియ‌మైన విందు.

1917 సినిమాలో చూపించింది ఇదే. కొన్ని కోట్ల మందిని బ‌లి తీసుకున్న మొద‌టి ప్ర‌పంచ యుద్ధ‌పు విశ్వ‌రూప‌మిది. 2019లో 100 మిలియ‌న్ల ఖ‌ర్చుతో తీసారు. దాదాపు 350 మిలియ‌న్లు వ‌సూలు చేసింది. మొద‌టి ప్ర‌పంచ యుద్ధం చాలా తెలివి త‌క్కువ‌గా ప్రారంభ‌మైంది. యుద్ధాల‌న్నీ ఇలాగే మొద‌ల‌వుతాయి. ఆస్ట్రియా యువ‌రాజ్‌ని, అత‌ని భార్య‌ని సెర‌జెవాలో హ‌త్య చేశారు. హ‌త్య‌కు ముందు ఆయ‌న కారుపై బాంబు వేస్తే అది పేల‌లేదు. అయినా ఏ మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా యువ‌రాజు గ‌వ‌ర్న‌ర్ నివాసానికి వెళ్లి విందు తీసుకుని కారులో న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌కి వెళ్లాడు. ప్రిన్సిటిప్ అనే ఒక్క కుర్రాడు గ‌న్‌తో కాల్చేశాడు. వాడు బ‌ల‌హీనంగా ఉండ‌డం వ‌ల్ల టెర్ర‌రిస్ట్ గ్రూప్‌లో చేర్చుకోలేదు. తాను ఆస్ట్రియా యువ‌రాజుని హ‌త్య చేస్తాన‌న్నాడు. ఎవ‌రూ న‌మ్మ‌లేదు. చేసి చూపించాడు. ఫ‌లితం ప్ర‌పంచ యుద్ధం.

ఒక మెసేజ్‌ని చేర‌వేయ‌డానికి ఇద్ద‌రు సైనికులు , జ‌ర్మ‌న్ స్థావ‌రాలను దాటుకుంటూ వెళ్ల‌డం క‌థ‌. దీని ప్ర‌త్యేక‌త ఏమంటే కెమెరా యాంగిల్స్ ఉండ‌వు. న‌టుల‌తో పాటు కెమెరా క‌దులుతూ ఉంటుంది. సింగిల్ షాట్‌లో తీసిన‌ట్టు అనిపిస్తుంది కానీ, సుమారులుగా 5 నెల‌లు తీసారు దీన్ని.

సైనికుల ప్ర‌యాణంలో మ‌న‌కు శ‌వాలు, ఖాళీ తూటాలు , కంద‌కాలు, ముళ్ల తీగ‌లు , ధ్వంస‌మైన భ‌వ‌నాలు అన్నీ నేప‌థ్యంలో క‌నిపిస్తూ ఉంటాయి. అల‌స‌ట‌, ప్రాణ‌భ‌యం, ఆక‌లి పీడుస్తూ ఉండ‌గా న‌డ‌వాలి. మ‌ధ్య‌లో చిన్న‌పిట్ట క‌థ‌లు చెప్పుకుంటూ ఉంటారు.

జ‌ర్మ‌న్ ఎలుక‌లు కూడా మ‌న ఎలుక‌ల కంటే పెద్ద‌గా ఉన్నాయ‌ని ఆశ్చ‌ర్య‌పోతారు. ఒక సైనికుడికి చెవి ఉండ‌దు. అంద‌రూ యుద్ధంలో పోయింద‌ని అనుకుంటారు. కానీ వాడి ప్రియురాలు ఇచ్చిన హెయిర్ ఆయిల్ త‌ల‌కి పూసుకుని నిద్ర‌పోతే ఒక ఎలుక వ‌చ్చి దాన్ని నాకేస్తుంది. చెవిని కూడా అదే కొరికింద‌ట‌.

మ‌ర‌ణంలో కూడా మా అమ్మ‌కి ఉత్త‌రం రాయ‌మంటాడు ఆ సైనికుడు. ఒక‌ర్నొక‌రు ఎప్పుడూ చూసుకోని వాళ్లు చంపుకోవ‌డ‌మే యుద్ధం.

మృత్యువు అన్ని వైపులా పొంచి ఉన్న‌ప్పుడు , అగ్ని జ్వాల‌లు అన్నీ ద‌హిస్తున్న‌ప్పుడు కూడా ఒక పసిపాప‌ని చూసి పాట పాడేవాడే సైనికుడు.

త‌న తాత చెప్పిన క‌థ‌నే తీసాడు ద‌ర్శ‌కుడు శాంమెండిస్‌. అవార్డులు కూడా చాలా వ‌చ్చాయి సినిమాకి.
1917లో ఇండో బ్రిటిష్‌ ఆర్మీలో త‌ప్ప‌, బ్రిటిష్ ఆర్మీలో సిక్కులు లేరు. ఇదీ పొర‌పాటు.
సిక్కు రెజిమెంట్స్ ఉన్నాయి త‌ప్ప , తెల్ల‌వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న సిక్కు సైనికులు లేరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి