iDreamPost

అద్భుతం చేసిన వైద్యులు.. 13 నెలల చిన్నారి కిడ్నీలు 30 ఏళ్ల యువకుడికి అమర్చారు!

అద్భుతం చేసిన వైద్యులు.. 13 నెలల చిన్నారి కిడ్నీలు 30 ఏళ్ల యువకుడికి అమర్చారు!

టెక్నాలజీ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైద్య రంగంలో సాంకేతికత సాయంతో వైద్యులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఊహకు కూడా సాధ్యంకాని సర్జరీలు చేస్తూ మనుషుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పటకే చరిత్రలో నిలిచిపోయే ఎన్నో ఆపరేషన్స్ ని వైద్యులు నిర్వహించారు. ఆ జాబితాలోకి ఇప్పుడు ఒక అరుదైన సర్జరీ చేరింది. అది కూడా మన భారతదేశంలోనే జరిగింది. ఒక 13 నెలల చిన్నారి రెండు కిడ్నీలను 30 ఏళ్ల యువకుడికి అమర్చారు. ఇలా చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల ఓ వ్యక్తి కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. అతని రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో అతను హీమో డయాలసిస్ సాయంతో కాలం వెళ్ల దీస్తున్నాడు. అతనికి ఒక డోనర్ నుంచి రెండు కిడ్నీలు అందాయి. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. ఆ కిడ్నీలు దానం చేసింది ఒక 13 నెలల చిన్నారి తల్లిదండ్రులు. ఊపిరాడక 13 నెలల చిన్నారి మరణించడంతో.. తల్లిదండ్రులు కిడ్నీలు దానం చేసేందుకు అంగీకరించారు. ఈ సాహసోపేతమైన శస్త్రచికిత్స చేసేందుకు బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చారు. యూరో ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష హరినాథ్ నేతృత్వంలోని వైద్యుల బృందం విజయవంతంగా ఈ సర్జరీని పూర్తి చేసింది.

మొత్తం 4 గంటలపాటు శ్రమించి వైద్యులు ఈ సర్జరీని పూర్తి చేశారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే.. చిన్నారి బరువు కేవలం 7.3 కిలోలు మాత్రమే.. మరోవైపు యువకుడి బరువు 50 కిలోలుగా ఉంది. మరి ఆ కిడ్నీలు అతని సెట్ అవుతాయా అని అనుమానాలు వినిపించాయి. అయితే కిడ్నీలు అతని శరీర బరువుకు తగినట్లుగా పెరుగుతాయంటూ వైద్యులు తెలిపారు. ఎంతో కష్టతరమైన సర్జరీలను రోబోటిక్ ఎన్ బ్లాక్ విధానం ద్వారా నిర్వహించవచ్చని వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత పేషంట్ ని ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. 12 రోజుల తర్వాత అతడిని డిశ్చార్జ్ చేశామన్నారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి