iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 6 – కాల్ సెంటర్ క్రైమ్ స్టొరీ

లాక్ డౌన్ రివ్యూ 6 – కాల్ సెంటర్ క్రైమ్ స్టొరీ

ఇంట్లో ఖాళీగా కూర్చోలేక హోం ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్న మూవీ లవర్స్ కు డిజిటల్ యాప్స్ సాధ్యమైనంత కొత్త వినోదాన్ని ఇవ్వడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాయి. అందులో భాగంగా తమిళ్ నుంచి తెలుగులోకి అనువాదమైన సినిమాలను థియేటర్లలో కాకుండా నేరుగా తమ ఓటిటి యాప్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు .ఇటీవలే వచ్చిన షూట్ ఎట్ సైట్, శక్తిలు బాగానే స్పందన తెచ్చుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఇదే కోవలో మరో చిత్రం అందుబాటులోకి వచ్చింది. అదే 100

కథ

సత్య(అధర్వా) ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేని ఓ యువకుడు. పోలీస్ ఉద్యోగం సాధించి సంఘవిద్రోహ శక్తుల భరతం పట్టాలని కలలు కంటూ ఉంటాడు. తీరా ఖాకీ జాబ్ వచ్చాక అతనికి 100 నెంబర్ కాల్ సెంటర్ లో పోస్టింగ్ ఇస్తారు. నిరాసక్తంగా ఉన్న సత్యకు ఓ ఫోన్ కాల్ అతని లక్ష్యాన్ని మార్చేస్తుంది. చనిపోయిందని పోలీస్ రికార్డ్స్ లో ఉన్న ఓ అమ్మాయి నుంచి 100కు కాల్ వస్తుంది. ఈ కేసును చేధించేందుకు పూనుకుంటాడు సత్య. దాని వెనుక ఉన్న ముఠాను ఎలా పట్టుకున్నాడన్నదే 100 స్టొరీ

నటీనటులు

గద్దలకొండ గణేష్ తో మనకు పరిచయమైన అధర్వా ఇందులో హీరో సత్యగా బాగా సూటయ్యాడు. ఆవేశం ఆలోచన కలగలసిన పాత్రలో ఒదిగిపోయాడు. హీరొయిన్ హన్సిక కేవలం నామ్ కే వాస్తే. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను దర్శకుడిచ్చాడు. తన నటన కూడా దానికి తగ్గట్టే ఉంది. సత్య ఫ్రెండ్ అన్వర్ గా చేసిన మహేష్ ది మరో కీలక పాత్ర. సీనియర్ నటులు రాధా రవి కంట్రోల్ రూమ్ లో సీనియర్ ఆఫీసర్ గా సత్యను సపోర్ట్ చేసే రోల్ లో తన అనుభవాన్ని చూపించారు. క్యాస్టింగ్ పెద్దగానే ఉంది కాని మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకెవరు లేరు

టెక్నికల్ టీం

దర్శకుడు సాం అంటోన్ తీసుకున ప్లాట్ లో మరీ కొత్తదనం లేకపోయినా సాధ్యమైనంత మేరకు బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కాకపోతే సత్య డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యేంత వరకు కథ ముందుకు సాగదు. ఆ తర్వాత పరుగులు పెడుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేయిస్తుంది. 100 కాల్ సెంటర్ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరూ తీసుకోలేదు కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే ఇది మంచి ప్రయత్నమే. తమిళనాడులో వీక్ ఓపెనింగ్స్ తో మొదలై ఆ తర్వాత మౌత్ టాక్ తో యాభై రోజుల దాకా వెళ్లిందీ మూవీ. సాం సిఎస్ మ్యూజిక్ బాగా దోహదపడింది. ఉన్న 3 పాటలు అనవసరం. తీసేసినా సరిపోయేది. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం బాగుంది. భారీ బడ్జెట్ డిమాండ్ చేసే ప్రాజెక్ట్ కాదు కాబట్టి సింపుల్ ఖర్చుతో లాగించేశారు.

చివరి మాట

క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవాళ్ళకు 100 మరీ రాంగ్ ఛాయస్ అయితే కాదు. మొదటి 40 నిముషాలు కాస్త ఓపిగ్గా భరిస్తే ఆపై ఓ మోస్తరుగా టైం పాస్ చేయిస్తుంది. మరీ రాక్షసుడు తరహాలో థ్రిల్స్, సస్పెన్స్ ఆశించకుండా జస్ట్ చూద్దాంలే అనుకుంటే పర్వాలేదు అనిపించేలా మీ టైంకు న్యాయం చేకూరుస్తుంది. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ క్వాలిటీ విషయంలో తీసుకున్న జాగ్రత్తల వల్ల అవుట్ పుట్ బ్యాడ్ గా అనిపించదు ప్రైమ్ లో అందుబాటులో ఉన్న 100కి మీ సమయాన్ని కొంత కేటాయించవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి