iDreamPost

బీజేపీ ఆ పని చేస్తే ఆప్‌ను మూసేస్తారట..!

బీజేపీ ఆ పని చేస్తే ఆప్‌ను మూసేస్తారట..!

జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత కేజ్రీవాల్‌ దూకుడు పెంచారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎలాగైనా ఈ సారి మూడు కార్పొరేషన్ల (ఢిల్లీ నార్త్, ఈస్ట్, సౌత్‌)ను కైవసం చేసుకోవాలని వ్యూహాలకు పదును పెట్టారు. అయితే ఆప్‌ జోరును అంచనా వేసిన బీజేపీ.. తన అధికారాన్ని ఉపయోగించి ఎన్నికలు వాయిదా పడేలా చేసింది. మూడు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాబోతున్న తరుణంలో.. ఆయా కార్పొరేషన్లను విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఆగిపోయింది.

ఈ పరిణామంతో బీజేపీపై అగ్గిమీద గుగ్గిలం అయిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌.. బీజేపీకి చురకలు అంటిస్తూనే సంచలన సవాల్‌ చేశారు. ఆప్‌ లాంటి చిన్న పార్టీని చూసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ భయపడి పారిపోతోందంటూ ఎద్దేవా చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఢిల్లీ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించి బీజేపీ గెలిస్తే.. ఆప్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్‌ చేసి కమలం నేతలను ఇరకాటంలో పెట్టారు. ఆప్‌ గెలుపును అంచనా వేయడంతోనే బీజేపీ ఎన్నికలు వాయిదా పడేలా వ్యవహరించిందని కేజ్రీవాల్‌ బలంగా నమ్ముతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడదలయ్యే సమయానికి కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కూడా ఆప్‌ విమర్శలకు బలం చేకూరుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీ మూడు కార్పొరేషన్లలో బీజేపీ పాలక మండళ్లే ఉన్నాయి. 2017లో జరిగిన ఎన్నికలో మూడు కార్పొరేషన్లలో 270 సీట్లకు గాను బీజేపీ 181 స్థానాలు గెలుచుకుంది. ఆప్‌ 48 సీట్లు, కాంగ్రెస్‌ 29 సీట్లు గెలుచుకున్నాయి. ఆప్‌ పాలనలో ఐదేళ్లలో ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఈ సారి మూడు కార్పొరేషన్లను ఆప్‌ గెలుచుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 70 సీట్లకు గాను 67 సీట్లు గెలుచుకుని రికార్డు విజయం సాధించింది. అయితే ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఢిల్లీ నగర ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. అప్పటికి ఆప్‌ పాలన మొదలై రెండేళ్లు మాత్రమే కావస్తోంది. అయితే ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో ఆప్‌ అద్భుతమైన పాలనను అందించింది. విద్య, వైద్యం సహా తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫలితంగా 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్‌ 63 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ఈ ఫలితాలతో ఆప్‌ పాలనకు నగర ప్రజలు జైకొట్టారని స్పష్టమైంది. ఇప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగినా.. ఇదే ఫలితం వస్తుందనే నమ్మకంతో కేజ్రీవాల్‌ ఉన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ వాయిదా పడేలా బీజేపీ వ్యవహరించడం కేజ్రీవాల్‌కు ఆగ్రహం తెప్పించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి