iDreamPost

ఓరి దేవుడా రివ్యూ

ఓరి దేవుడా రివ్యూ

ఒకే మూసలో వెళ్లకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తూ స్టార్ లీగ్ లోకి వెళ్లేందుకు బలమైన ప్రయత్నం చేస్తున్న హీరో విశ్వక్ సేన్. సినిమాలు బాగానే ఉన్నాయనిపిస్తున్నా పెద్ద రేంజ్ కు వెళ్లడంలో ఎందుకో తడబడుతున్న మాస్ కా దాస్ ఈసారి కంప్లీట్ లవ్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుని ఎంచుకున్నాడు. కొత్త కథలతో రిస్క్ చేయడం ఇష్టం లేక రీమేక్ తో ముందుకొచ్చాడు. అదే ఓరి దేవుడా. మాములుగా అయితే దీని మీద పెద్దగా అంచనాలు ఉండేవి కాదు కానీ విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ ని స్పెషల్ క్యామియోగా చేయడంతో ప్రేక్షకుల దృష్టి ఓరి దేవుడా మీద పడింది. పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమా మెప్పించిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ..

అర్జున్(విశ్వక్ సేన్), అను(మిథిలా పాల్కర్)చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు. బాయ్ ఫ్రెండ్ ఇంకా ఉద్యోగం తెచ్చుకోకపోయినా అతన్ని ఇష్టపడిన అను అతనికి లవ్ ప్రపోజ్ చేస్తుంది. వద్దని చెప్పడానికి కారణాలు లేకపోవడంతో అర్జున్ ఎస్ అంటాడు. స్నేహమనే ఫీలింగ్ వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది. ఏడాది తర్వాత గొడవలు ముదిరి విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు. ఇక్కడే లవ్ కోర్ట్ ద్వారా దేవుడు(వెంకటేష్)తన అసిస్టెంట్ ని పంపించి అర్జున్ ని పిలిపించి కారణాలు అడుగుతాడు. ఇదంతా జరగడానికి, ఈ దంపతుల మధ్య ప్రవేశించిన మీరా(ఆశా భట్)కు సంబంధం ఏంటనేది తెరమీదే చూడాలి

నటీనటులు..

రొటీన్ లవ్ స్టోరీలను ఎంచుకోకుండా స్టోరీ సెలక్షన్ లో జాగ్రత్త వహిస్తున్న విశ్వక్ సేన్ కు ఓరి దేవుడా పర్ఫెక్ట్ గా సరిపోయిన పాత్ర.   ఎనర్జీని వాడుకుంటూనే అవసరమైన భావోద్వేగాలను భారంగా పలికించాల్సిన సన్నివేశాల్లో మంచి మెచ్యూరిటీ చూపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మిథిలాని పూర్తిగా డామినేట్ చేసి ఫ్యాన్స్ ని అలరించాడు. వెంకటేష్ ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ లెన్త్ లో ఉన్నప్ప టికీ రెండో సగంలో మాత్రం కేవలం క్లైమాక్స్ సీన్ కే పరిమితం కావడం దగ్గుబాటి అభిమానులను నిరాశపరుస్తుంది. పాత్ర చిన్నది అందులోనూ మూడు నాలుగు రోజుల కాల్ షీట్స్ తోనే అయిపోజేశారు కాబట్టి ఇంత కన్నా ఆశించడానికి ఏమీ లేదు.

మిథిలా పాల్కర్ సన్నని పీలదేహంతో ఉన్నా మొహంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆకర్షణ హీరోయిన్ మెటీరియల్ గా మార్చింది. పెర్ఫార్మన్స్ పరంగానూ చక్కగానే చేసింది. వంకలు పెట్టడానికేం లేదు. తన కన్నా ఆశా భట్ ఆకర్షణీయంగా అనిపించే అవకాశం లేకపోలేదు. చిన్మయి డబ్బింగ్ కొంత హుషారుగా ఉంటే బాగుండేది. మురళీశర్మ, నాగినీడులవి రెగ్యులర్ తండ్రి పాత్రలే. రాహుల్ రామకృష్ణకు దొరికిన స్పేస్ తక్కువ. చెప్పడానికేం లేదు. విశ్వక్ స్నేహితుడిగా ఎక్కువ సేపు కనిపించే క్యారెక్టర్ లో వెంకటేష్ కాకుమానుకు చాలా గ్యాప్ తర్వాత ఐడెంటిటీ ఉన్న రోల్ దక్కింది. వీళ్ళు తప్ప ఆర్టిస్టులు ఇంకెవరు అంతగా గుర్తు రారు.

డైరెక్టర్ అండ్ టీమ్..

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ రీమేకుల ప్రపంచంలో మునిగి తేలుతోంది. స్టార్లు చిన్నోళ్లు అనే తేడా లేకుండా అందరూ వీటిని ట్రై చేస్తున్న వాళ్లే. ఓరి దేవుడా కూడా అదే సిరీస్ లో వచ్చిందే. కాకపోతే ఇది రెగ్యులర్ స్టైల్ లో సాగకుండా కొంత డిఫరెంట్ లైన్ తో వెళ్లడం ప్రధానంగా ఆకట్టుకునే అంశం. తనను తిట్టుకునే వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం దేవుడే భూమి మీదకు రావడమనేది చాలా పాత పాయింట్. గోపాల గోపాల, మా ఊళ్ళో మహాశివుడు లాంటి ఎన్నో ఉదాహరణలున్నాయి. అన్నిటిలోనూ హీరోను కాపాడటమనే అంశం కామన్ గా ఉంటుంది. ఓరి దేవుడాలోనూ అంతే. ఇలాంటి వాటిలో తర్కం కన్నా ఎక్కువ మాయాజాలం పనిచేస్తుంది

ఒరిజినల్ వెర్షన్ ని డీల్ చేసిన అశ్వత్ మారిముత్తుకే దీని బాధ్యతలు అప్పజెప్పి మంచి పని చేశారు. ఎందుకంటే తమిళంలో ఏవైతే ఎమోషన్స్ బలంగా నిలిచాయో వాటిని అవే స్థాయిలో పండించాలంటే దాన్ని సృష్టించిన వాళ్లయితేనే న్యాయం చేయగలరు. అశ్వత్ ఆ విషయంలో నిరాశ పరచలేదు. అర్జున్ కి దేవుడు హెల్ప్ చేసే ఎపిసోడ్ ని సరైన లాజిక్ తో డిజైన్ చేయకుండా హడావిడిగా లింక్ చేసేయడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు కానీ కథనంలో ఉన్న ఫ్రెష్ నెస్ ఆ లాజిక్స్ ని మర్చిపోయేలా చేస్తుంది. అలా అని ఓరి దేవుడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగుతుందని చెప్పడం లేదు. ల్యాగ్ మూమెంట్స్ ఉన్నాయి.

ఎలాంటి మార్పులు చేయకుండా యథాతధంగా తీయాలని అశ్వత్ నిర్ణయించుకోవడం మంచిదే కానీ ఫన్ యాంగిల్ లో ఇంకొంత వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. వెంకటేష్ లాంటి అద్భుతమైన టైమింగ్ ఉన్న స్టార్ దొరికినప్పుడు ఉన్నది కాసేపే అయినా ఆ కొంత భాగం హిలేరియస్ గా ఉంటే వినోదం ఇంకో స్థాయిలో పండేది. సరైన కంటెంట్ ఇవ్వాలే కానీ నిడివితో సంబంధం లేకుండా వెంకీ ఏ రేంజ్ లో ఆడుకుంటాడో అందరికీ తెలిసిందే. కానీ అది జరగలేదు. అయినా కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఉన్నది కాసేపే అయినా మంచి వెయిట్ ఇచ్చారు. ఒకవేళ ఇదే పాత్ర ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టుతో వేయించి ఉంటే ఖచ్చితంగా తేలిపోయి ఉండేది

స్నేహితురాలిని భార్యగా చేసుకుంటే సమస్యగా ఫీలయ్యే యూత్ కి ఓ చక్కని పాఠం చెప్పే ఉద్దేశం మారిముత్తుది. స్ట్రెయిట్ గా చెబితే అది బోరింగ్ డ్రామా అవుతుంది. అందుకే చాలా తెలివిగా దేవుడికి లింక్ పెట్టి దాని ద్వారా పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాడు. ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోయినా మరీ ఎక్కువ విసుగు రాకుండా ఎంగేజ్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నప్పటికీ మధ్యలో కొంత సాగతీతను తప్పించలేకపోయాడు. మీరా ప్రేమకథను హృద్యంగా చెప్పాలనుకున్న ప్రయత్నం అంతగా పండలేదు. లవర్ ని కేరళ నుంచి తీసుకొచ్చి ఆమెకు అప్పజెప్పే లాంటి సీన్స్ లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. గ్రాఫ్ ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది.

ఇంటర్వెల్ బ్యాంగ్ లో అర్జున్ కి దేవుడు టికెట్ ఇచ్చి ఇంకో ఛాన్స్ ఆఫర్ చేసినప్పుడు అక్కడి నుంచి స్పీడ్ పెరగాలి. కానీ రివర్స్ లో బండి నెమ్మదిస్తుంది. హీరోకి కనువిప్పు కలిగే క్రమం, మీరా కోసం ఇంకో రాష్ట్రం వెళ్లి ఆమె స్నేహితులను కలుసుకోవడం ఇదంతా సోసోగా నడుస్తుందే తప్ప భలేగా ఉందే అనే ఫీలింగ్ రాదు. ముందే చెప్పినట్టు ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, ప్రెజెంటేషన్ వల్ల వీక్ గా అనిపించే ఇలాంటి ఎపిసోడ్స్ మరీ భారంగా కాకుండా పర్లేదనిపించేలా సాగాయి. ఇంకొంచెం వర్క్ చేసి ఎంటర్ టైన్ అయ్యేలా ఏదైనా ప్లాన్ చేసుకుని ఉంటే బెటర్ అవుట్ ఫుట్ వచ్చేది. ఒకటి రెండు ట్విస్టులు తప్ప కథాకథనాలు అన్నీ ఊహించినట్టే సాగుతాయి.

విశ్రాంతి తర్వాత తనకు కొత్త లైఫ్ దొరికాక అర్జున్ చాలా హుషారుగా కనిపిస్తాడు. అంతే టెంపోని కంటెంట్ లో సైతం ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ అరగంటకు పైగా విశ్వక్ కంటినిండా నీళ్లతో బరువెక్కిన హృదయంతో ఎక్కువ కనిపిస్తాడు. దీంతో చూసేవాళ్ల ఉత్సాహం తగ్గిపోయి నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ థ్రెడ్ యూత్ కి ఎంత కనెక్ట్ అయినా ఫ్యామిలీస్ కి మెచ్చే రేంజ్ లో సాగదు. దీంతో వెంకటేష్ ఏమైనా వస్తాడేమోననే ఎదురు చూపులు మొదలవుతాయి. ఓ మై కడవులే చూసినవాళ్లకు ఈ ఇబ్బంది లేదు కానీ ఎటొచ్చి ఓరి దేవుడాని ఫస్ట్ టైం చూసినవాళ్లకు ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడతాయి. అయినా కూడా డీసెంట్ వాచ్ అనడంలో డౌట్ వద్దు.

మొత్తానికి ఓరి దేవుడా డిస్టింక్షన్ లో పాస్ అవుతాడనుకుంటే సెకండ్ క్లాస్ తో ఓకే అనిపిస్తాడు. అలా చూసుకున్నా మరీ అత్తెసరు మార్కులు రాలేదు కాబట్టి ప్రోగ్రెస్ కార్డు సంతృప్తిగానే అనిపిస్తుంది క్లాస్ ఫస్ట్ రేంజ్ లో అంచనాలు పెట్టుకోకపోతే.మూసకథలు, ఎలివేషన్ల యాక్షన్ల మధ్యలో ఇలాంటివి కొంత రిలీఫ్ అనిపిస్తాయి కానీ బెస్ట్ ఎంటర్ టైనర్స్ అనిపించుకునే అవకాశాలను వదులుకోవడమే అయ్యో అనే ఫీలింగ్ కలిగిస్తుంది. విశ్వక్ కోసమో యూత్ ఫుల్ కంటెంట్ కోసమో అయితే ఓకే కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఎలాంటి సందేశాలు సుదీర్ఘ ఎమోషన్లు వద్దనుకుంటే ఓరి దేవుడా అంత అర్జెంట్ గా వచ్చేయమని పిలుపు ఇవ్వడు

సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్  తమిళ వెర్షన్ మ్యూజిక్ ని చిన్న చిన్న మార్పులతో యథాతథంగా ఇచ్చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మంచి ఫీల్ ఉంది. రెండు పాటలు వినేందుకు చూసేందుకు బాగున్నాయి. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ వీలైనంత క్రిస్పీగా రన్ టైంని ఉంచేందుకు ట్రై చేసింది. తరుణ్ భాస్కర్ సంభాషణలు సహజంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అతని మార్కు చమక్కులు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల మరీ సాధారణంగా అనిపిస్తాయి. విధు అయ్యన్న ఛాయాగ్రహణంలో ఎలాంటి వంకలు లేవు. నీట్ గా ఉంది. బడా ప్రొడక్షన్ హౌస్ కాబట్టి నిర్మాణ పరంగా ఫిర్యాదు లేదు. అసలు సబ్జెక్టే కోట్ల రూపాయలు డిమాండ్ చేసేది కాకపోవడంతో రిస్క్ లేదు

ప్లస్ గా అనిపించేవి..

విశ్వక్ సేన్ నటన
హీరోయిన్స్
మెయిన్ పాయింట్
సంగీతం

మైనస్ గా తోచేవి..

వినోదం పాళ్ళు తగ్గడం
ఎమోషన్ల బరువు
మధ్యలో ల్యాగ్
ఊహించగలిగే నెరేషన్

కంక్లూజన్..

గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టు ఓటిటిని వదిలి థియేటర్ కు ఎందుకు రావాలనే ప్రేక్షకుడి ప్రశ్నకు జవాబు దర్శకులు కంటెంట్ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇంట్లోనే చూసేవాళ్ళం కదానే ఫీలింగ్ దేనికి వచ్చినా ఆటోమేటిక్ గా ఆ ప్రభావం థియేటర్ కలెక్షన్ల మీద పడుతోంది. ఓరి దేవుడా అలాంటి డేంజర్ జోన్ లో పడలేదు కానీ కొంచెం బిగి సడలి ఉంటే ఆ ప్రమాదాన్ని ఎదురుకునేది. మరీ గ్రాండ్ గా లేకపోయినా పర్లేదు ఏదో రకంగా టైం పాస్ చేయిస్తే చాలనుకుంటే దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. అలా కాకుండా వెంకీ కటవుట్ చూసో విశ్వక్ సేన్ ఎనర్జీని ఏవేవో ఊహించుకునో వెళ్లాలంటే మాత్రం అంచనాలను ముందే చెక్ చేసుకోవడం బెటర్

ఒక్కమాటలో – టైంపాస్ దేవుడు

రేటింగ్ : 2.5 /  5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి