iDreamPost

అందరికీ రాజ్యాధికారం.. చరిత్రను తిరగరాస్తోన్న జగన్‌

అందరికీ రాజ్యాధికారం.. చరిత్రను తిరగరాస్తోన్న జగన్‌

రాజ్యాధికారం.. బడుగుబలహీనవర్గాల కల. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచీ సరైన రాజకీయ ప్రాతినిథ్యం కోసం బడుగు, బలహీన వర్గాల నేతలు ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు వల్ల చట్టసభల్లో కొన్ని సీట్లు కేటాయించడంతో వారికి ఆ మాత్రమైన ప్రాతినిధ్యం దక్కుతుంతోంది. ఇక ఎలాంటి చట్టబద్ధ హక్కులేని ఇతర ఉన్నత పదవుల్లో వారికి ప్రాధాన్యం అంతంత మాత్రమే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల కింది స్థాయిలో రాజకీయ గుర్తింపు లభించినా.. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రాజ్యాధికారం కలగానే మిగిలిపోయింది. రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగు, బలహీనవర్గాల నేతలు రాజకీయ పార్టీలు పెట్టాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తుండడం రాజకీయంగా ఆయా వర్గాల వారి మనసుల్లో నెలకొన్న భావనకు నిదర్శనం.

తమను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయనేది ఆయా వర్గాల భావన. అయితే ఈ పరిస్థితికి చమరగీతం పాడుతున్నారు వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. బడుగుబలహీన వర్గాల ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతిలోకి తీసుకువస్తూ గత చరిత్రను తిరగరాస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలతో బడుగుబలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు తోడ్పతున్నారు. ఆయా వర్గాల్లో రాజకీయపరమైన ఆకాంక్షలు ఉన్న వారికి పదవులు కల్పిస్తున్నారు. తన మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్పించిన సీఎం వైఎస్‌జగన్‌.. పరోక్ష పద్దతిలో జరిగే ఎన్నికల్లోనూ అన్ని సామాజికవర్గాల వారికి సమప్రాధాన్యం దక్కేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం వైఎస్‌జగన్‌ బడుగు, బలహీన వర్గాల్లోని ద్వితియ శ్రేణి నేతలకు ప్రభుత్వంలో పదవులు కల్పించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక బలం లేని ప్రథమ శ్రేణి నేతలకు.. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే శాసన మండలికి పంపుతూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలను చూస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక సమతుల్యం ఏ విధంగా పాటిస్తున్నారో, బడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. 58 స్థానాలు గల ఏపీ శాసన మండలిలో ప్రస్తుతం జరగబోయే శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోయే ఆరుగురితోపాటు వైసీపీకి 16 మంది సభ్యులున్నారు. ఇందులో మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు ముగ్గురేసి చొప్పున ఉండగా.. కాపు/బలిజ సామాజికవర్గానికి చెందిన వారు ఇద్దరు, క్షత్రియ సామాజికవర్గం వారు ఒకరు, రెడ్డి సామాజికవర్గం వారు నలుగురు వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మైనారిటీల నుంచి మహ్మద్‌ ఇక్బాల్, జకియా ఖాన్, కరిమున్నీసా, బీసీల నుంచి జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్, పోతుల సునీత, ఎస్సీ సామాజికవర్గం నుంచి బల్లి కళ్యాణ చక్రవర్తి, పండుల రవీంద్రబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ శాసన మండలిలో వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాపు/బలిజ సామాజికవర్గం నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సి.రామచంద్రయ్యలు, పెన్మత్స సురేష్‌బాబు (క్షత్రియ),  వెన్నపూస గోపాల్‌ రెడ్డి, డీసీ గోవింద రెడ్డి, గంగుల ప్రభాకర్‌ రెడ్డి, చల్లా భగీరథ రెడ్డిలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. రాబోయే జూన్‌ నెలలోపు మరో 18 స్థానాలు మండలిలో ఖాళీ కాబోతున్నాయి. అవన్నీ వైసీపీకి దక్కడం లాంఛనమే. ఈ నేపథ్యంలో బడుగుబలహీన వర్గాల వారికి మరిన్ని పదవులు దక్కే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి