iDreamPost

ఈసారి రఘురాజు వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయి?

ఈసారి రఘురాజు వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయి?

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు మరోసారి తన వైవిధ్యత ప్రదర్శించారు. ఎప్పటిలానే రాజుగారు పార్టీ నేతల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా మంచి బడ్జెట్ అని రాజుగారు ప్రశంశించారు.

బడ్జెట్లో వ్యవసాయ, తాగునీటి రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారని విద్యా రంగానికి ఎక్కువగా కేటాయింపులు చేశారన్నారు. అంతటితో ఆగకుండా తాను ఏ అంశాలపై పార్లమెంట్ లో మాట్లాడానో వాటికి కేటాయింపులు ఎక్కువ జరపటం చాలా ఆనందంగా ఉందన్నారు. జల జీవన్ మిషన్, మెడికల్ కాలేజీ సీట్లపై తాను గతంలో మాట్లాడానని అలాంటివాటికి ఈబడ్జెట్ లో కేటాయింపులు జరిపారన్నారు.

అయితే ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వంటి నేతలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టనున్న పలు కార్యక్రమాలు అభినందనీయమని చెప్తున్నా రాష్ట్రానికి సంబంధించి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేకహోదా, లోటు బడ్జెట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకపోవడం వంటి వాటిపై కేంద్రం తీరును నిరసిస్తున్నారు.

ఈ సందర్భంలో రఘురాజు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించకుండా కేంద్ర బడ్జెట్ అద్భుతం అమోఘం అనడంతో పాటు తాను మాట్లాడిన అంశాలకు సంబంధించి ఎక్కువ నిధులు వచ్చాయని ఆత్మస్తుతి చేసుకోవటం పలు విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ రఘురాజు తెలుగు భాష, కోడి పందేలు తన పార్లమెంట్ పరిధిలో పలు అంశాలపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాకుండా సొంత ఆలోచనలు, అజెండాతో ముందుకు వెళ్తున్నారనే వార్తలు రాగా, దీనిపై పార్టీ అధిష్టానం ఆగ్రహించిందని అందుకు రఘురాజు వివరణ కూడా ఇచుకున్న సందర్భాలు తెలిసినవే.. అయితే ఇపుడు రాష్ట్ర ఆర్ధికవ్యవస్థకు సంబంధించి అత్యంత ముఖ్యమైన ఘటనపై రఘురాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కడివరకు దారి తీస్తాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి