iDreamPost

కలెక్టర్, ఎస్పీ లపై వైసిపి ఎమ్మెల్యే ఫైర్

కలెక్టర్, ఎస్పీ లపై వైసిపి ఎమ్మెల్యే ఫైర్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ లపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. జిల్లా అధికారులు ఇద్దరూ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొవ్వూరు నియోజకవర్గం లోని ప్రజలకు వాలంటీర్లకు, ప్రభుత్వ సిబ్బందికి రక్షణ సామాగ్రి, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొంతమంది అధికారులు హాజరయ్యారు.

భౌతిక దూరం పాటించకుండా లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించారంటూ పోలీసులు..ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అతని అనుచరులు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చిరెడ్డి పాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం సద్దుమణిగిందని భావిస్తుండగా తాజాగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు.

ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని సిఎం కార్యాలయం నుంచి చెప్పడంతో వదిలేశారని, అయితే జిల్లా ఎస్పీ కలెక్టర్లు చిన్న పిల్ల చేష్టలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు మళ్లీ నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. ఏ ఒక్క అధికారి పై చర్యలు తీసుకున్నా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందిస్తుంటే వారిపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఏసీ గదుల్లో కూర్చుని కలెక్టర్, ఎస్పీ లు సమీక్షల పేరిట తో సరి పెడుతున్నారని మండిపడ్డారు.

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఎస్పీ, కలెక్టర్ ఇద్దరూ బయటకు వచ్చి ప్రజలకు, క్షేత్ర స్థాయి అధికారులకు భరోసా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. తనపై పెట్టిన కేసు విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు తన మాటల్ని వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి