iDreamPost

భూమి నిండుగా న‌వ్విన రోజు

భూమి నిండుగా న‌వ్విన రోజు

ఈ రోజు World Earth Day. 1970 నుంచి జ‌రుపుకుంటున్నారు. ఈ 50 ఏళ్ల‌లో భూమి నిండుగా , హాయిగా ఊపిరి పీల్చుకుని న‌వ్విన రోజు ఇదేనేమో.

భూమ్మీద పెట్రోల్ పొగ‌లేదు, ఆకాశంలో విమానాల రొద లేదు. స‌ముద్రంలో చెత్త‌లేదు. ప‌క్షులు రెక్క‌లు విప్పుకుని ఎగురుతున్నాయి. మూగ‌ప్రాణులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నాయి. భూమిని మురికి చేసే మ‌నిషి ఇంట్లో దాక్కున్నాడు.

ఒక‌ప్పుడు మ‌నిషికి భూమి మీద ప్రేమ‌. భూమికి మ‌నిషంటే ఇష్టం. చ‌క్ర‌వ‌ర్తులు, మ‌హారాజులు, నియంత‌లు, సామాన్యులు ఎవ‌రైనా స‌రే చివ‌రికి భూమి గ‌ర్భంలో ఇమిడిపోవాల్సిందే. అందుకే మ‌న్ను మ‌న‌ల్ని ప్రేమిస్తుంది.

అయితే మ‌నిషికి దురాశ పుట్టింది. త‌న సుఖం కోసం భూమిని క‌ష్ట‌పెట్టాడు. చెత్త‌తో నింపేశాడు. స‌ముద్రాల్ని క‌లుషితం చేశాడు. ఆకాశంలో కూడా కంపు చేశాడు. చెట్టు క‌నిపిస్తే గొడ్డ‌లి తీశాడు. క‌నిపించిన ప్ర‌తి ప్రాణిని వేటాడాడు.

భూమి మీద కురుపుల్లాగా ఫ్యాక్ట‌రీ గొట్టాలు మొలిచాయి. ప‌చ్చ‌ద‌నం పొగ‌చూరింది. జీవించ‌డం మానేసి , భూమిని మ‌ర‌ణ‌శ‌య్య మీద పెట్టాడు మ‌నిషి.

విసిగిపోయిన భూమి శాంపిల్‌గా ఒక ప‌దార్థాన్ని వ‌దిలింది. దానికి జీవ‌మూ లేదు, మ‌ర‌ణ‌మూ లేదు. బాంబులు వేయ‌డానికి అదేం సిరియాలోని ప‌సిపిల్ల కాదు. అణుబాంబుల‌తో భ‌య‌పెట్టడానికి దానికో దేశ‌మూ లేదు. దాన్ని బెదిరించ‌లేం, హెచ్చ‌రించ‌లేం, డ‌బ్బుతో కొన‌లేం.

దేవుడి పేరు చెబితే పారిపోదు. దేవుళ్ల‌నే పారిపోయేలా చేసింది. పీఠాధిప‌తులు యాగాలు చేయ‌డం లేదు. పొగ‌కి ద‌గ్గితే క్వారంటైన్‌లో వేస్తారు. స్వామీజీకే క‌రోనా ఉంద‌ని తెలిస్తే భ‌క్తులు హ‌డ‌లిపోతారు. దుకాణం బంద్‌.

క‌రోనాకి కులం లేదు, మ‌తం లేదు, రాజ‌కీయాలు తెలియ‌వు. తీవ్ర‌వాదం అర్థం కాదు. భాష రాదు, కొర‌క‌రాని కొయ్య‌.

నువ్వు చేతులు క‌డిగితే క‌రోనా పోదు. భూమిని శుభ్రంగా క‌డిగితే పోతుంది. ఎక్కువ గ‌లీజ్ చేస్తే భూమి సెల్ఫ్ క్లీనింగ్ కోసం క‌రోనాని పంపిస్తుంది.

ఈ రోజు అత్యంత శుభ్ర‌మైన ప్ర‌పంచ భూమి దినోత్స‌వం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి