iDreamPost

ప్రపంచ కప్​ ముందు శ్రీలంకకు షాక్.. మెగా టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం!

  • Author singhj Published - 12:21 PM, Sun - 24 September 23
  • Author singhj Published - 12:21 PM, Sun - 24 September 23
ప్రపంచ కప్​ ముందు శ్రీలంకకు షాక్.. మెగా టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం!

శ్రీలంక జట్టు మునుపటిలా బలంగా లేదు. ఒకప్పుడు స్టార్ ప్లేయర్లతో పొరుగు దేశం కలకలలాడేది. రణతుంగ, సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ లాంటి ఎందరో గొప్ప ఆటగాళ్లను క్రికెట్​కు అందించిన ఘనత శ్రీలంకది. కానీ ఇప్పుడు మాత్రం అనుభవజ్ఞులైన ప్లేయర్లు టీమ్​లో లేకపోవడంతో సతమతమవుతోంది. సంగక్కర, జయవర్దనే టీమ్​లో ఉన్నప్పుడే యంగ్ ప్లేయర్లను తయారు చేసుకోవాల్సింది. కానీ అలా చేయకపోవడంతో వీళ్ల తర్వాత టీమ్​లో స్టార్ ఆటగాళ్లు లేకుండా పోయారు. ఒక్క మాథ్యూస్ మాత్రమే వారి లోటును భర్తీ చేస్తూ వచ్చాడు.

బౌలింగ్​లోనూ లసిత్ మలింగ లాంటి నిఖార్సయిన పేసర్​తో పాటు మురళీధరన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఉండటంతో​ లంక ప్రత్యర్థులను వణికించేది. వీళ్ల తర్వాత ఆ స్థాయి బౌలర్లు రాలేదు. అయితే స్పిన్​ భారాన్ని రంగనా హెరాత్ చాన్నాళ్లు మోశాడు. ఇప్పుడు లంక టీమ్ యువకులతో నిండిపోయింది. అయితే వీరిలో ప్రతిభకు కొదువేం లేదు. ఇటీవల ఆసియా కప్​లోనూ ఇది నిరూపితమైంది. ఆ టోర్నీలో ఒక్క ఫైనల్స్​లో తప్పితే మిగతా అన్ని మ్యాచుల్లోనూ శ్రీలంక అదరగొట్టింది. ఫైనల్స్​లో ఎదురైన ఘోర పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ జట్టు.. త్వరలో జరగనున్న వరల్డ్ కప్​కు సన్నద్ధమవుతోంది.

ప్రపంచ కప్​కు రెడీ అవుతున్న లంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ వనిందు హసరంగ మెగా టోర్నీకి దూరం కానున్నాడని సమాచారం. గాయంతో బాధపడుతున్న హసరంగ ఇంకా కోలుకోలేదని, అతడు వరల్డ్ కప్​లో ఆడే అవకాశాలు లేవని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై త్వరలో లంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ బౌలింగ్ ఆల్​రౌండర్ ఆడకపోవడంతో ఆసియా కప్​లో లంక జట్టు ఇబ్బంది పడింది. ఇప్పుడు వరల్డ్ కప్​లోనూ లేకపోతే మరింత సమస్య తప్పదని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. హసరంగాతో పాటు దుష్మంత చమీరా కూడా వరల్డ్ కప్​లో ఆడకపోవచ్చునని వినిపిస్తోంది. వీళ్లు లేని లోటును అధిగమించి లంక ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: ఆసీస్​తో రెండో వన్డే.. భారత ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి