iDreamPost

యస్ బ్యాంక్ సంక్షోభం.. వైవి ముందు చూపుతో వెంకన్న సొమ్ము భద్రం..

యస్ బ్యాంక్ సంక్షోభం.. వైవి ముందు చూపుతో వెంకన్న సొమ్ము భద్రం..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ముందు చూపుతో తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ దేవదేవుని భక్తులు, టీటీడి అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడి పాత పాలకమండలిని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త పాలక మండలిని నియమించారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి నియమితులయ్యారు. జూన్ 22, 2019 న టీటీడి 50 వ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు.

టీటీడి బాధ్యతలు చేపట్టాక దేవస్థానం డిపాజిట్ల పై వైవి దృష్టి సారించారు. టీటీడి డిపాజిట్లు ప్రధానంగా నాలుగు ప్రముఖ బ్యాంక్ లలో ఉండడంతో, ఆ నాలుగు బ్యాంకుల ప్రస్తుత పరిస్థితి పై, వ్యాపార తీరు, ఆర్ధిక స్థితిగతులపై ఆరా తీసిన వైవి సుబ్బారెడ్డి అధికారులనుండి కొంత కీలక సమాచారం తెప్పించుకున్నారు. ఆసమయంలో ఆ నాలుగు బ్యాంకులలో ఒకటైన “యస్‌ బ్యాంక్‌” పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైవి నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన వెంటనే సియం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏది ఏమైనా దేవుడి సొమ్ము భద్రంగా ఉండాల్సిందేనని జగన్ వైవి సుబ్బారెడ్డికి సూచించారు.

వెంటనే వైవి సుబ్బారెడ్డి టీటీడీ డిపాజిట్లను రిటర్న్ చెయ్యాలని యస్‌ బ్యాంక్‌ ని ఆదేశించారు. డిపాజిట్లను ఉపసంహరించుకోవద్దని యస్‌ బ్యాంక్‌ టీటీడీపై ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వాటిని ఖాతరు చేయలేదు. దీంతో యస్‌ బ్యాంక్‌ లో ఉన్న టీటీడి సొమ్ము మొత్తం 1300 కోట్ల రూపాయలు వెనక్కి వచ్చాయి. యస్ బ్యాంక్ నుండి ఉపసంహరించుకొన్న ఈ 1,300 కోట్ల రూపాయల డిపాజిట్లను కొద్ది నెలల క్రితమే ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి మరలించారు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో యస్ బ్యాంక్ పై మారటోరియం, విత్‌ డ్రాయల్స్‌పై ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌లో ఖాతాదారులు నెలకు రూ.50,000 మించి తీసుకోవడానికి వీలు లేదంటూ ఆర్‌బీఐ ఆంక్షలు విధించడాన్ని బట్టి ఆ బ్యాంక్ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మునుముందు యస్ బ్యాంకు దివాళా దిశగా పయనించడం ఖాయమని, బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకం కావచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.

మొత్తానికి కొన్ని కోట్లమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామి వారి సొమ్ము విషయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యవహారించి స్వామి వారి సొమ్మును భద్రంగా వెనక్కి తీసుకురావడంతో భక్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి