iDreamPost

ముగిసిన ఎన్నిక‌లు.. తెర‌పైకి తృతీయ ఫ్రంట్..!

ముగిసిన ఎన్నిక‌లు.. తెర‌పైకి తృతీయ ఫ్రంట్..!

దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయా? జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు అవ‌స‌రం అంటూ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీయేత‌ర పార్టీల‌కు లేఖ రాసిన మ‌మ‌తా బెన‌ర్జీ ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తున్నారా..? ఇటీవ‌ల వెల్ల‌డైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో బీజేపీ ప్ర‌భావం త‌గ్గ‌డంతో ఇదే స‌రైన స‌మ‌యమ‌ని భావిస్తున్నారా..? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఘన విజయం సాధించింది. తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే విజయం పొందింది. కేర‌ళ‌లో బీజేపీ క‌నీసం ఖాతా తెర‌వ‌లేక‌పోయింది. తృతీయ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డానికి ఇది అనువైన స‌మ‌యమ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న స‌మ‌యంలోనే బీజేపీయేతర నేతలకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలను ఖూనీచేస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు. సోనియా గాంధీ తోసహా బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె కీలక విజ్ఞప్తి చేశారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా మనమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సి వ్యూహంపై చర్చించేందుకు భేటీ అవుదామని ప్రతిపాదించారు మమతా బెనర్జీ.

బీజేపీ అవ‌లంబిస్తున్న ప్రాంతీయ పార్టీల వ్య‌రేతిక‌ విధానాల‌ను లేఖ‌లో ప్ర‌స్తావించారు. ”దేశ రాజధాని ప్రాంత సవరణ బిల్లు ద్వారా సీఎం నుంచి అధికారాలను బీజేపీ లాగేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అప్రకటిత వైస్రాయ్‌గా మార్చేసింది. బీజేపీయేతర పార్టీలను లక్ష్యంగా చేసుకొని.. రాజ్యాంగపరమైన హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తోంది. రాష్ట్రాలకు ఉన్న అధికారాలను నిర్వీర్యం చేస్తోంది. సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. ధన బలంతో బీజేపీయేత ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు చేస్తోంది. దేశం ఆస్తులను మొత్తం ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తోంది. మనమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది. మీతో కలిసి పోరాటం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా.” అంటూ మమతా బెనర్జీ ఎన్నిక‌ల‌కు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇప్పుడు ఎన్నిక‌లు ముగియ‌డం, భారీ మెజార్టీతో టీఎంసీ గెలిచిన ఉత్సాహంలో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ తృతీయ ఫ్రంట్ ప్ర‌య‌త్నాల వైపు దృష్టి సారించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కేంద్రంలో మరోసారి తృతీయ ఫ్రంట్‌ శకం ప్రారంభమవుతుందని, రానున్న రోజుల్లో ప్రత్నామ్నాయం అవుతుందని జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తాజాగా అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభావం తగ్గినట్టు స్పష్టమైందని పేర్కొన్నారు. జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు గట్టి గుణపాఠం చెప్పాయంటూ సోమవారం ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశంలో బీజేపీ, నరేంద్ర మోదీ పట్ల ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలైందని, తాజా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఓ శక్తి అవతరిస్తాయని అభిప్రాయపడ్డారు. కాగా 2019 ఎన్నికల్లో పలు రాష్ట్రాలలో తృతీయఫ్రంట్‌కు అండగా నిలవలేదన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సంపూర్ణంగా ప్రగతిని సాధించలేక పోయాయని తెలిపారు. తమకు రావాల్సిన గ్రాంట్లు, పథకాలను మోదీ నుంచి పొందడం సాధ్యం కావడం లేదని.. ఇదే పరిస్థితి ఒడిసా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఉందన్నారు. 2018 ఎన్నికలకు ముందు కూడా ఇటువంటి ప్రక్రియ సాగిందని వివరించారు. గత ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడం కొంత వెనుకబాటుకు కారణమైందని కుమారస్వామి ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి బాట ప‌ట్ట‌డంతో తృతీయ ఫ్రంట్ ప్ర‌కియ‌ను వేగవంతం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. మ‌రి భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి