iDreamPost

పాఠశాలలు మళ్లీ ప్రారంభమవుతాయా..?

పాఠశాలలు మళ్లీ ప్రారంభమవుతాయా..?

దీనిపై క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఎప్పుడో ప్రకటించాయి కదా అనుకుంటున్నా రా..? అయితే… అప్పటి పరిస్థితి వేరు.. పెరుగుతున్న ఇప్పటి కేసుల లెక్క వేరు…, ఈ కేసుల తీవ్రత, కోర్టు తీర్పు మేరకు తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలకమైన పదో తరగతి పరీక్షలు సైతం రద్దు చేసింది. నేరుగా పై తరగతికి ప్రమోట్ చేసింది. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గేంత వరకూ, లేదా వ్యాక్సిన్ వచ్చే వరకూ స్కూళ్లు వద్దని ‘పేరెంట్స్ అసోసియేషన్’ పేరుతో కొందరు హైకోర్టులో ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. విద్యార్థుల శ్రేయస్సు రీత్యా కర్ణాటకలో పాఠశాలలకు ఒక సంవత్సరం సెలవు ప్రకటిస్తూ.. లోకల్ ఛానళ్లలో న్యూస్ వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జూన్ నెలలో పాజిటివ్ ల నమోదు ఉధృత స్థాయిలో ఉంటోంది. తెలంగాణలో బుధవారం 1096 శాంపిల్స్ పరీక్షిస్తే… ఏకంగా 269 మందికి పాజిటివ్ వచ్చింది. ఏపీలో 15000 మంది వరకూ పరీక్షలు చేయగా 351 మందికి కరోనా సోకింది. మొత్తం ఇప్పటి వరకు 5, 555 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే… ఇప్పటికే జూలై ఒకటి నుంచి ఉన్నత, ఆగస్ట్ ఒకటి నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం అవుతాయని తెలంగాణలో, ఆగస్ట్ 3 నుంచి ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వాలు ప్రకటించాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు తీసుకుని వచ్చే నెలలో పది పరీక్షల నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్దం అవుతోంది. కానీ జూలై చివరి నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 50 వేల చేరువకు కరోనా కేసులు పెరుగుతాయని వైద్యులు అంచనా వేస్తున్నారు.

మరి అదే నిజమైతే.. అలాంటి పరిస్థితుల్లో పాఠశాలల ప్రారంభం ప్రశ్నార్థకమే..! మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో చేసిన ప్రకటన పాఠశాలల ప్రారంభం పై నిర్వాహకులులో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇక అన్నీ అన్ లాక్ చేసుకుంటు వెళ్లే దిశగా ఆలోచించాలని సీఎం లకు చెప్పారు. వాటిలో విద్యాలయాలు కూడా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. కానీ తల్లిదండ్రుల ఆందోళన, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక స్థాయి వరకూ పాఠశాలలు తెరవక పోవచ్చని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఉదృతి ఏ నిర్ణయాలను ఎలా మారుస్తుందో వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి