iDreamPost

ఆరడుగుల బులెట్ కు దారి దొరికిందా

ఆరడుగుల బులెట్ కు దారి దొరికిందా

ఎప్పుడో మూడేళ్ళ క్రితం 2017లో విడుదల కావాల్సిన గోపీచంద్ సినిమా ఆరడుగుల బులెట్ ఆఖరి నిమిషంలో ఆగిపోయి ఇప్పటిదాకా వెలుగు చూడనే లేదు. బి గోపాల్ లాంటి స్టార్ డైరెక్టర్ నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ ఉన్నా లాభం లేకపోయింది.నిర్మాత ఆర్ధిక పరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో ఫస్ట్ కాపీ చేతిలోనే ఉన్నా విడుదల చేసుకోలేని పరిస్థితి. సుమారు 6 కోట్ల దాకా బకాయిలు ఉండటం వల్లే డిస్ట్రిబ్యూటర్లు దీనికి అడ్డుకట్ట వేశారని ఆ సమయంలోనే టాక్ వచ్చింది. బడ్జెట్ అప్పటికే ఇరవై కోట్ల దాకా ఖర్చు పెట్టారు. కానీ ఆ ఆరు మాత్రం సర్దలేక ప్రొడ్యూసర్ చేతులెత్తేయడంతో ఆరడుగుల బులెట్ ల్యాబ్ లోనే ఆగిపోయింది.

ఇప్పుడు దీనికి లాక్ డౌన్ టైంలో దారులు తెరుచుకుంటున్నాయని ఫిలిం నగర్ టాక్. థియేటర్లలో రిలీజ్ చేస్తే ఎలాగూ వర్క్ అవుట్ కాదు కాబట్టి నేరుగా ఓటిటికి ఇచ్చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అదే జరిగితే బాకీలు తీరడంతో పాటు శాటిలైట్ డీల్ కూడా కుదుర్చుకోవచ్చు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. కాంబినేషన్స్ పరంగా అన్ని పర్ఫెక్ట్ గా కుదిరిన ఆరడుగుల బులెట్ ఇలా ఇన్ని సంవత్సరాలు మగ్గిపోవడం ఆశ్చర్యమే. ఇది ఒకరకంగా సరైన సమయమే అనుకోవాలి. ఎలాగూ సినిమా హాల్ దాకా వచ్చి అందరూ దీన్ని చూసే ఛాన్స్ లేదు కాబట్టి డిజిటల్ రూపంలోనైనా ఎక్కువ శాతం ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంది.

మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. గోపిచంద్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో చిత్రమే ఇన్ని అష్టకష్టాలు పడితే ఇక చిన్నా చితాక వాటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆరడుగుల బులెట్ ట్రైలర్ కూడా అప్పుడే రిలీజ్ చేశారు. తమ హీరోకు హిట్టు వస్తుందేమో అని ఆశ పెట్టుకున్నారు అభిమానూలు. అయితే వాటిని నిర్వీర్యం చేస్తూ ఉదయం ఆటకు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మాక షోలు పడలేదు. మార్కెట్ ఉన్న హీరోకు అలా జరగడం గత కొన్నేళ్లలో అదే మొదటిసారి. ఇప్పుడు ఏదో ఒకరకంగా రిలీజ్ చేసి మమ అనిపించేస్తే హిట్టో ఫట్టో ఏదో ఒకటి జరిగిపోతుంది. కనీసం చూసే భాగ్యమైనా దక్కుతుంది. లెట్ వెయిట్ అండ్ సి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి