iDreamPost

బీజేపీయే రంగంలోకి దిగితే బాబు టార్గెట్ చేస్తారా..?

బీజేపీయే రంగంలోకి దిగితే బాబు టార్గెట్ చేస్తారా..?

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీకి అన్ని పార్టీలూ రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతున్న ఈ ప‌రిస్థితుల్లో పోటీ నుంచి త‌ప్పుకునేందుకు తెలుగుదేశం మొద‌ట్లో వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేసింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ కోస‌మే పోటీ చేయ‌డం లేదు అనే ప‌రిస్థితుల‌ను క్రియేట్ చేసి మోదీ మెప్పు పొందేందుకు ప్ర‌య‌త్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు బాబు ప‌ప్పులుడ‌క‌నివ్వ లేదు. దీంతో టీడీపీకి పోటీలో నిల‌బ‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు రూటు మార్గారు. పోటీ లో నిల‌బ‌డ‌కుండా ప‌రువు పోగొట్టుకునే బ‌దులు ఏదోలా రంగంలోకి దిగుదామ‌ని సిద్ధ‌మ‌య్యారు. ఇక్క‌డి వ‌ర‌కూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు బాగానే ఉంది. ర‌ణ‌రంగంలోకి దిగాక చంద్ర‌బాబుకు చుక్క‌లు త‌ప్ప‌వ‌నే చ‌ర్చ మొద‌లైంది.

ఎందుకంటే.. తిరుపతి ఉపఎన్నికలో భాజపా కనుక రంగంలోకి దిగితే బాబుగారికి ఇంతా అంతా కష్టం కాదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు మోడీ పై నిప్పులు చెరిగి, దాదాపు వ్యక్తిగత విమర్శలకు కూడా ఒడిగట్టి, దేశం అంతా కాలికి స్పెషల్ ఫ్లయిట్ కట్టుకుని మరీ తిరిగేసి, ఆయనను ప్రధాని కాకుండా చూడాలని తెగ తాపత్రయ పడిపోయారు. తీరా చేసి ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన మరుక్షణం ప్లేటు మార్చేసారు. పైకి బాహాటంగా మాట్లాడకపోయినా భాజపాకు దాసోహం అన్నట్లుగా అయిపోయారు. పొరపాటున కూడా భాజపా, మోడీ, అమిత్ షా లాంటి పదాలు తన నోటి వెంట రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అలా వచ్చాయి అంటే అవి అభినందించడం కోసం తప్ప వేరు కాదు. ఇలాంటి టైమ్ లో తిరుపతి ఎన్నిక వస్తోంది. ఇక్కడ భాజపా పోటీకి దిగితే పరిస్థితి ఏమిటి? కేవలం వైకాపాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసుకుంటూ పోవడమా? భాజపాను కూడా విమర్శించాలా? అలా విమర్శిస్తే మోడీ గురించి ఆయన పోలవరం, అమరావతి విషయాల్లో తీసుకున్న స్టాండ్ గురించి, రైతుల ఉద్యమం గురించి ప్రస్తావించాలా? వద్దా? ఇవన్నీ సమస్యలే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి