iDreamPost

టీడీపీ నేతలు ముందస్తు జపం ఎందుకు చేస్తున్నట్టు?

టీడీపీ నేతలు ముందస్తు జపం ఎందుకు చేస్తున్నట్టు?

పస్తులున్న ముసలాయన కుస్తీ పోటీలకు వెళతానన్నట్టు ఉంది టీడీపీ నేతల తీరు. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవలి మున్సిపల్ పోరు వరకు వరుస పరాజయాలను మూటగట్టుకున్న ఆ పార్టీ ముందస్తు జపం చేయడమే కాక వైఎస్సార్ సీపీని చిత్తుగా ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తాజాగా ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అని ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి పాలనపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని, అది భారీగా పెరగకముందే ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నాయుడు అయితే మరో అడుగు ముందుకు వేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ 160 స్థానాలు సాధిస్తుందని జోస్యం కూడా చెప్పేస్తున్నారు.

అధికార పార్టీకి ఆ అవసరం ఉందా?

చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న సూచనలు లేవు. పైగా అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలను సాధిస్తోంది. ప్రతి ఎన్నికకు తమ ఓటుశాతం పెంచుకుంటోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు కూడా కాలేదు. ఇచ్చిన హామీలను ఖచ్ఛితంగా అమలు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, విపక్షం ఎంత దుష్ప్రచారం చేసినా ప్రభుత్వం అమలు చేయదలచుకున్న సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తోందన్న అభిప్రాయం జనంలో ఉంది. ఈ అంశాలను పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం లేదనిపిస్తుంది.

మరి టీడీపీ ఎందుకు ప్రచారం చేస్తోంది?

పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ మధ్య తిరుపతిలో ఒక ప్రైవేటు సంభాషణలో పార్టీ లేదు.. తొక్కాలేదు అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు రాష్ట్రంలో టీడీపీ దుస్థితికి అద్దంపట్టాయి అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. ఆ వ్యాఖ్యల తరువాత టీడీపీ పుంజుకున్న దాఖలాలు లేవు. పైగా ఆ తరువాత జరిగిన కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోయింది.
చంద్రబాబు కంచుకోటగా భావించే కుప్పం నియోజకవర్గం పరిధిలోని మునిసిపాలిటీని కోల్పోవడం టీడీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేసింది అని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. అటువంటప్పుడు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. టీడీపీ ఘనవిజయం ఖాయం అని చంద్రబాబు, అచ్చెన్న ఎందుకు చెబుతున్నారు అన్న సందేహం వస్తోంది.

వరుస పరాజయాలతో కుదేలైన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, ఉన్న నాయకులు పక్క పార్టీల వైపు చూడకుండా ఉండడానికి చంద్రబాబు ఈ ఎత్తు వేశారని విమర్శకులు భావిస్తున్నారు. అదిగో ఎన్నికలు.. ఇదిగో ఎన్నికలు అంటూ హడావుడి చేస్తే క్యాడర్లో జోష్ నింపవచ్చనేది చంద్రబాబు వ్యూహం. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో ఫలానా వారికి సీటు అని హామీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఉనికి కోసం పాట్లు పడుతున్న తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికలలోపు చెల్లాచెదురు కాకుండా కాపాడేందుకు చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడంకాదు కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్ గెలవగలరా అని అధికార పార్టీ నేతలు సవాల్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి